అమెరికా పౌరసత్వం మరింత భారం..ట్రంప్ సర్కార్ కొత్త నిబంధన..!
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా .. ఈ అగ్రరాజ్యంలో నివసించాలని భావించని వ్యక్తి ఉండడేమో.. అలాంటి వారందరికీ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక టెన్షన్ పుట్టిస్తున్నారు. ఇప్పటికే హెచ్-1బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసిన ట్రంప్.. నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ వచ్చారు. లేటెస్టుగా దరఖాస్తు ప్రక్రియను సైతం ఖరీదైందిగా మార్చేశారు. కొత్త నిబంధనను ఫెడరల్ రిజిస్టర్ లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేశారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఈ కొత్త ముసాయిదా నిబంధనను రూపొందించింది. దీని ప్రకారం పౌరసత్వ దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అయ్యే పూర్తి ఖర్చులను రాబట్టుకోవడమే లక్ష్యంగా ఫీజులను పెంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ప్రవేశపెట్టిన కఠినమైన స్క్రీనింగ్, భద్రతా తనిఖీలకు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా ఈ ఫీజుల ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం పేపర్ ఫైలింగ్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి 760 డాలర్లు (సుమారు రూ. 71,940) ఫీజుగా ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం దీనిని 1,330 డాలర్లకు (సుమారు రూ. 1,25,895) పెంచనున్నారు. అంటే.. ఫీజులో ఏకంగా 570 డాలర్ల పెరుగుదల, అంటే సుమారు 75 శాతం భారం పడనుంది. ఇదే కాకుండా దరఖాస్తు తిరస్కరణకు గురైతే అప్పీల్ బోర్డు ముందు పునఃపరిశీలన కోసం వేసే అభ్యర్థన ఫీజును కూడా 830 డాలర్ల (సుమారు రూ. 78,566) నుంచి 1,475 డాలర్ల (సుమారు రూ. 1,39,620)కు పెంచనున్నారు. ఇది దాదాపు 77.7 శాతం పెరుగుదల.
ఈ ఫీజుల పెంపును డీహెచ్ఎస్ సమర్థించుకుంటోంది. ఒక వలసదారునికి లభించే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం పౌరసత్వమేనని ఓ డీహెచ్ఎస్ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధంగా నివసిస్తున్న లక్షలాది మంది శాశ్వత నివాసితులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వారికి పౌరసత్వం అందని ద్రాక్షగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉంది. కనీసం 60 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.








