‘అణు’ దూకుడుకు ‘కిమ్’ పదును.. !
ప్రస్తుత నియంతల్లో ఒకరిగా భావించే ఉత్తరకొరియా అధినేత కిమ్.. మరోసారి తన దూకుడు మంత్రాన్ని పటించారు. దేశం అణ్వస్త్ర సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కిమ్. అది ఎంతలా జరగాలంటే ప్రపంచాన్ని అధిగమించే స్థాయికి తీసుకెళ్లాలన్నారు కిమ్. కొరియా వర్కర్స్ పార్టీ కీలక సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి.
అణ్వస్త్రాలే ప్రధాన బలం
మూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో దేశ రక్షణ, ఆర్థిక విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అణ్వస్త్రాలే దేశ సైనిక సార్వభౌమత్వానికి కేంద్రబిందువని కిమ్ స్పష్టం చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో అణ్వస్త్ర దేశంగా తన స్థానాన్ని మరింత బలపరచుకోవడమే సరైన మార్గమని సమావేశం తీర్మానించింది. అణు సాంకేతికత ఆధారంగా మరిన్ని రక్షణ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని కిమ్ ఆదేశించారు.
దక్షిణ కొరియాను తమ ‘‘ప్రధాన శత్రుదేశం’’గా ఉత్తర కొరియా మరోసారి అభివర్ణించింది. అమెరికా-దక్షిణ కొరియా సైనిక సహకారాన్ని తీవ్రంగా విమర్శించింది. ఇటీవల జరిగిన న్యూక్లియర్ కన్సల్టేటివ్ గ్రూప్ (ఎన్సీజీ) సమావేశం తమపై అణు యుద్ధ ప్రణాళికలకే వేదికగా మారిందని ఆరోపించింది. దక్షిణ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాలని, కొత్త నౌకాదళ స్థావరాలు నిర్మించాలని కిమ్ సూచించారు.
10 వేల టన్నుల సామర్థ్యం గల వ్యూహాత్మక క్షిపణి క్రూజర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. సరిహద్దు ప్రాంతాల్లో కొత్త ఆయుధ వ్యవస్థల మోహరింపుపైనా దృష్టి పెట్టింది. ఇదే సమయంలో పార్టీ అగ్ర నాయకత్వంలో మార్పులు చోటుచేసుకున్నాయి.








