North Korea: కిమ్ క్షిపణి గర్జన.. ఏకకాలంలో 10 మిసైళ్ల ప్రయోగం!
North Korea: అమెరికా , దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక సైనిక విన్యాసాల నేపథ్యంలో ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. శనివారం ఏకంగా పది క్షిపణులను ఒకేసారి ప్రయోగించి తన సైనిక బలాన్ని ప్రదర్శించింది. ఈ పరిణామంపై దక్షిణ కొరియా సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రయోగం జరిగిన తీరు:
దక్షిణ కొరియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీప ప్రాంతం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు. అయితే ఇవి ఎంత దూరం ప్రయాణించాయి, వీటి లక్ష్యం ఏమిటన్న దానిపై దక్షిణ కొరియా సైన్యం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు జపాన్ రక్షణ శాఖ స్పందిస్తూ.. కిమ్ ప్రభుత్వం ప్రయోగించిన ఆయుధాలు తమ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ (EEZ) వెలుపల ఉన్న సముద్రంలో పడినట్లు ధ్రువీకరించింది.
ముదురుతున్న ఉద్రిక్తతలు:
ఈ వారం ఆరంభంలోనే ఉత్తర కొరియా ఒక యుద్ధనౌక ద్వారా క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, తన కుమార్తె కిమ్ జు యేతో కలిసి కాన్ఫరెన్స్ హాల్ నుండి ఈ ప్రయోగాలను స్వయంగా వీక్షించారు. విదేశీ అణ్వస్త్ర దాడుల ముప్పును తిప్పికొట్టడమే లక్ష్యంగా తాము ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు కిమ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
అమెరికా-దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలు తమ దేశ భద్రతకు ముప్పు అని భావిస్తున్న ఉత్తర కొరియా, వరుస ప్రయోగాలతో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.








