కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన తుంగతుర్తి వర్గపోరు!
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గపోరు మరోసారి బహిర్గతమై అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల వ్యవహార శైలిపై తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన నల్గొండ జిల్లాను కోమటిరెడ్డి సోదరులు తమ సొంత రాజ్యంగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. తమ గురించి హీనంగా మాట్లాడటం సరికాదని, తాము వారి దగ్గర చేతులు చాచి లేదా వారి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని స్పష్టం చేశారు.
తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగలేదని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సామేల్ ఘాటుగా స్పందించారు. “ముందు నీ మునుగోడులో నీ పరిస్థితి ఏంటో నువ్వు చూసుకో” అని హితవు పలికారు. మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అక్కడ పరిస్థితి దారుణంగా ఉందంటూ తనకు కూడా నివేదికలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మునుగోడు ప్రజలకు, పార్టీకి రాజగోపాల్ రెడ్డే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సామేల్ వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తమ వద్దకు చాలామంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని వచ్చారని, అయితే మందుల సామేల్‌కు మాట ఇచ్చామని, అందుకే ఆయనను గెలిపించామని చెప్పారు. టికెట్ కోసం తమ వద్దకు వందల సార్లు వచ్చాడని పేర్కొంటూ.. “ఆయనను గెలిపించి తప్పు చేశాం.. మమ్మల్ని క్షమించండి” అని తీవ్ర వ్యాఖ్యలతో కార్యకర్తలకు క్షమాపణలు కోరారు.
స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే పరస్పరం బహిరంగ విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. జిల్లాల్లో పట్టు సాధించేందుకు కోమటిరెడ్డి సోదరులు యత్నిస్తున్నారనే కోపంతో కొందరు స్థానిక నాయకులు ఉంటే, సీనియర్ల ప్రాబల్యాన్ని తట్టుకోవడం సామేల్ లాంటి నాయకులకు సవాలుగా మారింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగలేదంటూ సొంత పార్టీ నేతలే పరస్పరం వ్యాఖ్యానించుకోవడం విపక్షాలకు మంచి అవకాశంగా మారే ప్రమాదం ఉంది.
ఈ అంశంపై తుంగతుర్తి నియోజకవర్గ పరిశీలకుడు జగ్గారెడ్డి ఇవాళ పీసీసీకి నివేదిక సమర్పించనున్నారు. రాజగోపాల్ రెడ్డి, సామేల్ ఎపిసోడ్ తన దృష్టికి వచ్చిందని, నియోజకవర్దంతో పాటు జిల్లాలోని అందరి నేతల అభిప్రాయాలను తీసుకుని నివేదిక రెడీ చేసినట్లు ఆయన వెల్లడించారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, కాంగ్రెస్ పార్టీలో మితిమీరిన స్వేచ్ఛ ఒక్కోసారి లాభం, కొన్నిసార్లు నష్టం చేకూరుస్తుందన్నారు.
నేతల మధ్య బహిరంగ విభేదాలు కార్యకర్తలలో గందరగోళానికి దారితీస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో నాయకుల మధ్య ఇటువంటి ఘర్షణ వాతావరణం నెలకొనడం పార్టీ ఇమేజ్ను దెబ్బతీసే అవకాశం ఉంది. మరి ఈ రచ్చపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో, ఈ వర్గపోరుకు ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.








