మోదీ, కేంద్రమంత్రుల పేరిట వస్తున్న వీడియోలన్నీ నకిలీవే : PIB Fact Check
జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు బెదిరిస్తున్నట్లు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. అయితే.. దీనిపై PIB FACT CHECK స్పష్టతనిచ్చింది. అవన్నీ నకిలీ వీడియోలని స్పష్టం చేసింది. అలాగే అవన్నీ కూడా AI జెనరేట్ వీడియోలని పేర్కొంది.
ఆ నకిలీ వీడియోల్లో చూపినట్లు ప్రధాని మోదీ గానీ, కేంద్ర మంత్రులు గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టతనిచ్చింది. దేశంలో జరుగుతున్న ఆందోళనలను అదునుగా చేసుకొని, పాక్ కి చెందిన కొన్ని నెట్ వర్కులు ఈ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నాయని తెలిపింది.
అలాగే ప్రశ్నా పత్రాల లీకేజీపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వీడియోను కూడా AIతో మార్ఫింగ్ చేశారని పీఐబీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా అనుమానాస్పద, ఫేక్ కంటెంట్ ప్రజల దృష్టికి వస్తే, +8799711259, Email : factcheck@pib.gov.in ద్వారా తమకు రిపోర్టు చేయాలని సూచించింది.
ఈ నెల 23 వ తేదీన పాకిస్థాన్‌కు చెందిన 480కి పైగా సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ ఖాతాల ద్వారా వదంతులు, నకిలీ పోస్టులు, ఎడిట్ చేసిన వీడియోలను వ్యాప్తి చేసి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఈ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
ఇప్పటి వరకూ సుమారు 480 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి, బ్లాక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు జూలై 23న తెలిపారు.పోలీసుల ప్రకారం, ఈ ఖాతాలు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం మరియు మోసపూరిత పోస్టులను వ్యాప్తి చేయడం ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని తాము గమనించామని, ఈ నిరసన చుట్టూ తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడానికి పాకిస్థాన్ ఆధ్వర్యంలోని వందలాది ఖాతాలు సమన్వయంతో ప్రచారం చేస్తున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.“సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం అవుతున్నట్లు మేము గమనించాము. ఇప్పటివరకు, ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన 480కి పైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించాము. ఈ ఖాతాలను బ్లాక్ చేస్తున్నాము,” అని పోలీసులు తెలిపారు.








