దివ్యజ్ఞానం – భౌతికం నుండి బ్రహ్మాండానికి ఆత్మప్రస్థానం
దివ్యజ్ఞానం – శ్రీ శార్వరి రచించిన సావిత్రి తొమ్మిది సంపుటాల్లో ఇది ఎనిమిదవ పుస్తకం. దివ్యజ్ణానంతో యోగి పరలోకదర్శనం లేదా విశ్వదర్శనం చేస్తాడు. ఇది కేవలం ఆత్మానుభవమే కాని శారీరకం కాదు. అరవింద్ సావిత్రి మాతృక కావ్యంలో ‘ది ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్సె’ అన్నభాగంలో అశ్వపతి ఆత్మపురోగమనంలో దర్శించిన విభూతులు, సందర్శించిన లోకాలు, విశేషాలు రాయడం జరిగింది.
పతంజలి మహర్షి మొదలుకొని ఎందరో మహానుభావులు, మహాయోగులు ప్రజ్ఞతో మాత్రమే దర్శించిగలిగే ఈ ఆత్మ విభూతుల్ని తమ రచనల్లో అభివర్ణించారు. ఊర్థ్వలోకాలు, అధోలోకాలు ఉన్నాయని, భూలోకం, భువర్లోకం, మహేంద్రలోకం, మహర్లోకం, జ్ఞానలోకం, తపోలోకం, సత్యలోకం పుణ్యలోకాలుగా, మహాతల, రసాతల, అతల, సుతల, వితల, తలాతల పాతాళ లోకాలుగా, మహాకాల, అంబరీష, రౌరవ, మహారౌరవ, కాలసూత్ర, అంధతమిస్తృ నరకలోకాలుగా చెబుతారు. శ్రీ అరవిందులు సావిత్రి కావ్యరచనతో పూర్ణయోగాన్ని ఆవిష్కరించడమేకాక ఈ ప్రజ్ఞాలోకాల్ని మనకి దర్శింపచేస్తారు.
మహా పరనిర్వాణంతో సత్యవంతుడు పునరుజ్జీవుడవుతాడు, సావిత్రి సత్యవంతుల మరల ఒకటవుతారు. మహాయోగి అయిన అశ్వపతి భౌతిక బంధాలు త్రెంచుకుని, ప్రాపంచిక వాసనల నుండి బయటపడి, అదృశ్యంగా వున్న లోకాలకి చేరుకుంటాడు. ఆద్యంతాలు లేని అశ్వపతి ఆత్మకి సృష్టి అవగతమైంది. నిర్గుణ బ్రహ్మకు నిర్వచనం తెలిసింది. భౌతికత సరిహద్దుల్ని దాటిన ఆత్మ సందర్శించగలిగే ఈ లోకాల్నిషఅశ్వపతీ దర్శిస్తాడు.
పుణ్యలోకాలు, నరకలోకాలు వుంటాయా అనే సందేహం చాలా మందిలో ఉండేదే. “మన హృదయం సంభావించినదే మనసు సృష్టిస్తుంది” అంటారు శ్రీ శార్వరి. ఆత్మ భౌతిక శరీరాన్ని ఆశ్రయించినప్పుడు బరువులు మోయకతప్పదు. చివరికి పరమాత్మే భూమిపైన అవతరించినా ఇదే నిజం. “మృత్యువు పరిధిలో కొనసాగే జీవితం దివ్యచైతన్యంతో అమరత్వం పొందుతుంది” అంటారు శ్రీ శార్వరి.
దివ్యజ్ణానం పొందిన వారు కష్టసుఖాలకి, బాంధవ్యాల విషయంలో స్థిర చిత్తులైవుంటారు. వ్యసనాలకు, వాంఛలకు బానిసలుకారు. ఆనందాలను, విషాదాలను సమంగా స్వీకరిస్తారు. ఇందుకు భిన్నంగా సామాన్యుడి జీవితం ఒక స్వప్నంలా సాగుతుంది. స్థిరత్వం వుండదు, ఒక రంగం నుండి మరొక రంగానికి పరుగులు తీస్తుంటాడు. ఎక్కడ ఉన్నది తెలియదు, ఎక్కడకి చేరుతున్నదీ అంతకన్నా తెలియదు. అందుకే అరవిందులు ఇలా అంటారు, “ఆత్మజన్య రూపాలను ఏమాయ కప్పివేయలేదు. అవి ఈశ్వర తేజస్సులో శాశ్వతాలై నిలుస్తాయి”. ఇలాంటి వారికి జీవిత చక్రం తెలుసు. పుట్టుక, పెరుగుదల, క్షీణించడం, మరణించడం అనే నాలుగు పరిణామాలు జీవికి తప్పవు అనే స్పృహ వీరిని సమాజం భిన్నంగాను ఉన్నతంగాను చూస్తుంది. భూమిపైన కనిపించే రూపాలు, అనుబంధాలు ఎన్నటికీ శాశ్వతం కావు. ఆ సత్యం తెలియడమే దివ్యజీవనానికి పునాది.
జీవుడికి బతికినంత కాలం అమరత్వం దాగే ఉంటుంది, సత్యం బోధపడదు. మృత్యుశయ్య మీద ఉన్నప్పుడు ఆత్మ ఉద్దీప్తమవుతుంది, దివ్యజీవనం గురించి ఆలోచిస్తాడు. నిజానికి అద్భుతాలను నిజం చేయగల శక్తి ఎప్పుడూ ఆత్మదే. అసంభవాలను సంభవాలుగా చేయగలిగేది ఆత్మే. ఆ ఆత్మ చైతన్యమే దివ్యజీవనానికి తొలి అడుగు. దివ్యజ్ణానంతో ఆత్మ విశ్వాత్మగా పరిణితి చెందాలే కాని శక్తుల్ని ఆర్జించడమో, ఆస్తులు పోగేసుకోవడమే లక్ష్యం కాకూడదు.
దివ్యజీవనం అంటే స్వర్ణమయ జీవితం కాదు సుఖ జీవితం. నిర్మలానంద జీవితం చెడు అలవాట్లలో, ఉన్మాదంతో కూడిన సుఖలాలసలో వుండదు. అలా అని నమ్మి వాటి వెంట పడే వాళ్ళ జీవితం భయానక అగ్నికుండమై, దుర్లభమైపోతుంది. అమిత భోగాలు మాయని మరకలుగా, అనాగరిక చిహ్నాలుగా మిగిలిపోతాయి. భౌతికతే నిజమని నమ్మే ప్రయాణం ఎంతో కాలం సాగదు. అదే ఆత్మచైతన్యంతో వేసే ప్రతి అడుగు అతీంద్రియ సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది, బ్రహ్మానందాన్ని, శాశ్వతానందాన్ని కలిగిస్తుంది. మనలో నిగూఢంగా, నిక్షిప్తంగా ఎన్నో దివ్యభావనలుంటాయి. కనిపించక, వినిపించక మనల్ని నడిపించే ఆ మహాశక్తిని తెలుసుకోవడమే దివ్యజీవనం. “మన జీవితాల ఆంతర్యం, మన ఊహలకు కలలకు మించింది” అంటారు శ్రీ శార్వరి. “పరమాత్మ కృపకు ఆత్మజ్యోతి ఒక్కటే మనకు మార్గగామి” అంటారు శ్రీ అరవిందులు.
దివ్యజీవనంలో ఆత్మది సదా అన్వేషణే, అంతం అంటూ వుండదు. ఈ అన్వేషణలో ఏవీ తృప్తి నివ్వవు, ఏవీ ఎన్నటికీ సమగ్రంగా కనిపించవు. ఏది ఎలా జరగాలన్నా పరమాత్మ సంకల్పమే. భూమిపైన, స్వర్గంలో, నరకంలో ఎక్కడా ఆత్మ మారదు. భౌతికంగా ఈ నేలపైన ఎంత దూరం పయనించినా చిరువెలుగులు తప్ప సృష్టి ఆంతర్యాలు అందవు. నిష్ప్రయోజన మర్గాలలో మనిషి పయనిస్తాడు, కాలాన్ని వృధా చేసుకుంటాడు. నిరుపయోగమైన శబ్దచయంలో సంధానపడి అసలైన బ్రహ్మానందాన్ని అందుకోలేడు.
చివరగా ఈ పుస్తకంలో ఆణిముత్యాల్లాంటి కొన్ని వాక్యాలు:
ఈ భౌతిక ప్రపంచంలో భగవదారాధన ఒక్కటే జీవున్ని ప్రలోభ పెట్టదు.
వర్తులం మొదట ప్రారంభమైన చోటనే అంతమవుతుంది.
మృత్యువు మార్గమే కాని, అంతిమ గమ్యం కాదు.
మన జీవితానికి విశ్రాంతి చివరకు పరమాత్మలోనే.
జీవితానికి అంతం ఉండదు, పరమాత్మను చేరడమే.
సజీవశూన్యాన్ని అనుభవించగలిగిన వాడే మృత్యువుని చూడగలుగుతాడు.
వెలుగు వెంట నీడ, జీవం వెంట మృత్యువు, సృష్టి వెంట లయం ఈ సృష్టితో ఏర్పడ్డవే.
దివ్యజ్ఞానంతో అన్నిజీవులు చివరికి బ్రహ్మానందం పొందుతాయి.
ఇది దివ్యజ్ఞానంతో అశ్వపతి భౌతికం నుండి బ్రహ్మాండానికి చేసిన ఆత్మప్రస్థానం.
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Dr. S.
Cordova, Tennessee 38018, USA
Cell: 901-387-9646
ramanavvasili@hotmail.com








