చిన్న ఈమెయిల్..భారీ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో కీలక క్లూ
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక్క చిన్న ఈమెయిల్ ఎన్నేళ్లుగా చీకట్లో దాగిన ఒక భయంకరమైన సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌కు చెందిన కీలక సాక్ష్యాలు ఇచ్చేలా తలుపు తెరుస్తాయని ఎవరూ ఊహించి ఉండరు.
ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆ బ్యాంక్ ఉద్యోగి తన ఇన్‌బాక్స్‌ను చెక్ చేస్తోంది. వందలాది మంది వీఐపీ కస్టమర్ల మెసేజ్‌ల మధ్య, ఒక కొత్త ఈమెయిల్ ఆమె కంట్లో పడింది. ఆ మెయిల్ ఓపెన్ చేసి చూస్తే, మొదటి లైన్లో కేవలం రెండే మాటలు ఉన్నాయి:
“PLEASE HELP!”
కింద ఉన్న రిక్వెస్ట్ చదివి చూస్తే షాక్ తగిలింది. “మా అకౌంట్లో ఉన్న అన్ని ఈమెయిల్ అడ్రస్‌లను వెంటనే తొలగించండి… జెఫ్రీకి చాలా కోపం వచ్చింది. ఆయనకు సంబంధించిన ఫ్లైట్ కన్ఫర్మేషన్లు నాకు తప్ప వేరే ఎవరికీ వెళ్లకూడదు” అని ఉంది.
పైకి చూస్తే అది ఏదో ఒక సాధారణ వీఐపీ కస్టమర్ హడావుడిలాగే అనిపించింది. ఆ ఉద్యోగి కూడా బహుశా ఆ రోజు అంతే అనుకుని ఉంటుంది. కానీ, ఆ ఒక్క ఈమెయిల్ వెనుక… జరగని ప్రయాణాలు, అసలు ప్రయాణమే జరగని విమాన టికెట్లు, వీసాల కోసం గిమ్మిక్కులు చేసి తయారుచేసిన డమ్మీ బుకింగ్స్… అన్నింటికంటే ముఖ్యంగా, సంవత్సరాలుగా గుట్టుగా నడుస్తున్న ఒక పెద్ద సెక్స్ ట్రాఫికింగ్ రాకెట్ ఉన్నాయి.
అప్పట్లో ఆ మెయిల్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ,కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ కేసు దర్యాప్తు పత్రాలను పరిశీలించినప్పుడు, ఇదే ఈమెయిల్ మొత్తం కథకు మొదటి క్లూగా మారింది.
ఎందుకంటే…
ఆ ఒక్క రిక్వెస్ట్‌ను అనుసరిస్తూ అధికారులు ఒక్కో ఈమెయిల్‌ను వెలికితీయడం ప్రారంభించారు. అప్పుడు వారికి ఒక విచిత్రమైన ప్యాటర్న్ కనిపించింది. మళ్లీ మళ్లీ బుక్ అవుతున్న విమాన టికెట్లు…కొద్ది గంటల్లోనే రద్దవుతున్న రిజర్వేషన్లు… అసలు జరగని ప్రయాణాలు… “వీసా కోసం” అని ప్రస్తావించిన ఈమెయిల్స్… మొదట ఇవన్నీ సాధారణ ట్రావెల్ ఏర్పాట్లే అనిపించాయి. కానీ అన్ని ఆధారాలను కలిపి చూసినప్పుడు…
అవి కేవలం ట్రావెల్ బుకింగ్స్ కాదని, మరింత పెద్ద నేర దర్యాప్తుకు దారి తీసే క్లూలని అధికారులు గుర్తించారు.
అసలేం జరిగింది?
ప్రపంచాన్ని కుదిపేసిన కుబేరుడు, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ నడిపిన చీకటి సామ్రాజ్యం గురించి అందరికీ తెలిసిందే. మైనర్లను, యువతులను—ముఖ్యంగా రష్యా, లిథువేనియా లాంటి తూర్పు యూరప్ దేశాల నుంచి లైంగిక వేధింపుల కోసం అమెరికాకు, కరేబియన్ దీవులలోని తన వ్యక్తిగత ద్వీపాలకు తరలించడమే ఈ నెట్వర్క్ అసలు ఉద్దేశం.
ఈ అక్రమ రవాణా కోసం అతను వందలాది మంది మహిళలను రప్పించాడు. అయితే, వీరందరినీ ఎలాంటి చట్టపరమైన చిక్కులు లేకుండా, అధికారుల కంట పడకుండా దేశాలు దాటించడమే ఎప్స్టీన్ ఆఫీస్ ముందున్న అసలు సవాలు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ రాకెట్‌ను నడపడానికి వాళ్ళు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనాన్షియల్ సిస్టమ్‌ను, సరిగ్గా చెప్పాలంటే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (Amex) బ్లాక్ కార్డ్ నెట్‌వర్క్‌ను గుడ్డిగా వాడుకున్నారు.
ఇప్పుడు ఎందుకు తవ్వుతున్నారు? ఈ ఈమెయిల్ ఎందుకు కీలకం?
ఎప్స్టీన్ ఉదంతానికి సంబంధించి కోర్టు రికార్డులను, దర్యాప్తు పత్రాలను అమెరికా అధికారులు ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. ఈ ప్రాసెస్‌లో బయటపడిన వేలకొద్దీ పేపర్లలో… ఎప్స్టీన్ అసిస్టెంట్ లెస్లీ గ్రాఫ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ రిలేషన్షిప్ మేనేజర్ల మధ్య జరిగిన చాట్లు, ఈమెయిళ్లే అక్షరాలా బయటపడ్డాయి.
ఈ సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఎంత పక్కాగా, కార్పొరేట్ లెవెల్లో నడిచింది అనడానికి ఈ బ్యాంక్ చాట్సే సాక్ష్యంగా నిలిచింది. ఈ ఈమెయిల్స్, చాట్స్… ఈ లగ్జరీ ఫైనాన్షియల్ సర్వీస్ దర్యాప్తులో ఎందుకు కీలకంగా మారిందో చూపించాయి. అదే కారణంగా అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఈ కేసులో తీవ్ర పరిశీలనకు గురయ్యాయి.
అసలు ఆ ‘డమ్మీ బుకింగ్స్’ మాయాజాలం ఏమిటి?
ఇక్కడ ఒక లాజిక్ ఎవరికైనా వస్తుంది. ఆ అమ్మాయి ఎలాగోలా ఫ్లైట్ ఎక్కి అమెరికా వచ్చేస్తుంది కదా, మరి మధ్యలో ఈ ఫేక్ టికెట్ల గోల ఏంటి? అనిపిస్తుంది. ఇక్కడే అసలు గేమ్ ఉంది.
అమెరికాలోకి టూరిస్ట్ వీసాపై రావాలంటే… “పని కాగానే ఆ వ్యక్తి తిరిగి తమ దేశానికి వెళ్లిపోతారు” అని నిరూపించడానికి రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించాలి. కానీ ఆ అమ్మాయిలను శాశ్వతంగా వెనక్కి పంపడం ఎప్స్టీన్ ప్లాన్‌లో లేదు. మరి రిటర్న్ టికెట్ లేకుండా వీసా ఎలా వస్తుంది? రాదు!
అందుకే, కేవలం వీసా ఇంటర్వ్యూలో కాన్సులేట్ అధికారులను నమ్మించడానికి మాత్రమే ఒక ఫేక్ రిటర్న్ టికెట్‌ను డమ్మీ బుకింగ్ రూపంలో సృష్టించేవారు. వీసా రాగానే ఆ బుకింగ్‌ను వెంటనే క్యాన్సిల్ చేసేవారు. రష్యా ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులను బురిడీ కొట్టించడానికి ఈ ఫేక్ ప్లాన్స్ చక్కగా పనిచేశాయి.
మొదట విమాన టికెట్లు బుక్ చేయడం, కొద్దిసేపటికే వాటిని రద్దు చేయడం, ఆ ప్రయాణాలు అసలు జరగకపోయినా ఆ బుకింగ్స్‌కు డబ్బులు ఖర్చు చేయడం ఇదంతా ఒక పద్ధతి ప్రకారం సాగింది.
డబ్బుంటే చట్టం కూడా వంగుతుందా?
అమెరికాలో నకిలీ డాక్యుమెంట్లు పుట్టడం కొత్తేం కాదు. కానీ ప్రపంచంలోనే అత్యంత హై-ప్రొఫైల్ అయిన ఒక ఫైనాన్షియల్ బ్రాండ్, ఈ నేరంలో పావుగా మారడమే అసలు షాకింగ్ విషయం. ఈ వివాదం పెద్దదైన తర్వాత, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ స్పందిస్తూ… ఫెడరల్ ఛార్జీలు నమోదు కాగానే ఆ అకౌంట్‌ను పూర్తిగా రద్దు చేశామని, ఇలాంటి దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది.
అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ ఒకటే నిజం స్పష్టమవుతోంది. డబ్బుతో లగ్జరీని కొనొచ్చు, జనాలని కొనుగోలు చేయవచ్చు, ఇలాంటి ప్రత్యేక సేవలను కూడా పొందవచ్చు. కానీ… ఆ రోజు ఆ బ్యాంక్ అసిస్టెంట్ కి పంపిన ఒక్క చిన్న ‘PLEASE HELP’ ఈమెయిల్ బయటపడినట్లుగానే… ఎన్నేళ్లుగా దాచిన నేరాల రహస్యాలను ఏ నాటికీ పూర్తిగా దాచలేరు!








