హైడ్రాపై ఎందుకు ఇన్ని ఆరోపణలు?
హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు, చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన ‘హైడ్రా’ (HYDRAA) ప్రస్తుతం తీవ్ర న్యాయపరమైన, పరిపాలనాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతుందని ప్రచారం పొందిన ఈ సంస్థ, ఇటీవల అనుసరిస్తున్న కొన్ని తొందరపాటు చర్యల వల్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహానికి గురైంది. చట్టబద్ధమైన ప్రక్రియలను విస్మరిస్తున్నారంటూ న్యాయస్థానం చేసిన ఘాటు వ్యాఖ్యలు, “అవసరమైతే ఆర్మీని పిలిపించి మరీ కమిషనర్‌ను అరెస్టు చేయిస్తాం” అని హెచ్చరించడం రాష్ట్ర రాజకీయ, ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్, ఆయన సిబ్బంది అనుసరిస్తున్న శైలేనని బాధితులు, న్యాయవాదులు బలంగా ఆరోపిస్తున్నారు. గతంలో కూడా రంగనాథ్ పనితీరుపై కోర్టులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వైఖరిలో మార్పు రాకపోవడం చర్చనీయాంశమైంది. కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రైవేటు ఆస్తుల చుట్టూ కంచెలు వేయడం, కూల్చివేతలకు దిగడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించకుండా చేసే ఏ చర్యైనా సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్లేనని, రాజ్యాంగ విరుద్ధమేనని న్యాయస్థానం తేల్చిచెప్పింది. న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరిస్తూ పరిధి దాటి ప్రవర్తిస్తే ఎంతటి ఉన్నతాధికారినైనా చట్టం ముందు నిలబెడతామని, రాజ్యాంగం అందరికీ ఒక్కటేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ విమర్శలు, కోర్టు ఆగ్రహం ఒకవైపు నడుస్తుండగానే.. మరోవైపు మిలిటరీ యంత్రాంగం స్వయంగా హైడ్రా సాయాన్ని అర్థించడం అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా మారింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరి పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని సైనిక అధికారులు హైడ్రా కమిషనర్‌ను కలిసి సహాయం కోరారు. ఆక్రమణలను అడ్డుకోవడంలో హైడ్రాకున్న క్షేత్రస్థాయి ప్రాధాన్యతను, పవర్లను ఈ సంఘటన చాటిచెబుతోంది.
ప్రస్తుతం హైడ్రా పనితీరు రెండు విరుద్ధమైన కోణాలను ఆవిష్కరిస్తోంది. ఒకవైపు ప్రజాదరణ, అవసరం కాదా.. మరోవైపు న్యాయపరమైన సంక్షోభంలో చిక్కుకుంది. ఆక్రమణల నిరోధానికి ఆర్మీ వంటి వ్యవస్థలే స్వయంగా సాయం కోరడం ఆసక్తి కలిగిస్తోంది. అదే సమయంలో కొంతమంది పౌరుల ప్రాథమిక హక్కులను హైడ్రా ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు, చట్టపరమైన పరిమితులను దాటి ముందుకు వెళ్తోందన్న అభిప్రాయం బలపడితే అది ప్రభుత్వ పొలిటికల్ గ్రాఫ్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.
హైడ్రా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి బయటపడాలంటే తన వ్యూహాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంది. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడం సమర్థనీయమే అయినప్పటికీ, కొన్ని అంశాలను తప్పక పాటించాలి. ప్రతి చర్యకూ ముందస్తు నోటీసులు ఇవ్వాలి. రెవెన్యూ, మున్సిపల్ పరిధులపై స్పష్టత తెచ్చుకోవాలి. న్యాయస్థానాల ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ వ్యవహరించాలి.
న్యాయసూత్రాలకు కట్టుబడి పనిచేసినప్పుడు మాత్రమే హైడ్రా వ్యవస్థ తన విశ్వసనీయతను కాపాడుకోగలదు. లేనిపక్షంలో ఇది కేవలం ఒక రాజకీయ వేధింపుల సాధనంగా, చట్టాన్ని అతిక్రమించే యంత్రాంగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే మున్ముంది మరిన్ని సమస్యలు తప్పవు.








