ఉక్రెయిన్ డ్రోన్లపై రష్యా బ్రహ్మాస్తం.. యోల్కా..!
ఉక్రెయిన్‌పై సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా (Russia).. ఇప్పటికీ పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించలేకపోతోంది. దీంతో వ్యూహం మార్చిన మాస్కో .. సరికొత్త అస్త్రాలను బరిలోకి దించుతోంది. వాటిలో అత్యంతముఖ్యమైంది యోల్కా ఇంటర్ సెప్టర్. అత్యంత తక్కువ ధరకు తయారు కావడమే కాదు… యుద్ధరంగంలో అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. దీంతో ప్రపంచం దృష్టి ఈ యోల్కా ఇంటర్ సెప్టర్ పై పడింది.
ఉక్రెయిన్ పై పోరులో యోల్కా ఇంటర్ సెప్టర్ లను విరివిగా ఉపయోగిస్తోంది రష్యా. ఇది పిస్టల్ మాదిరి పరికరంతో సులభంగా ప్రయోగించే వీలుంటుంది.ముఖ్యంగా… శత్రువుల డ్రోన్లను గాల్లోనే వెంటాడి, ఢీకొట్టే సామర్థ్యమున్న ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ ధర కూడా తక్కువేనని సమాచారం. వీటికి సంబంధించి రష్యా సైనికుల వీడియో వైరల్‌గా మారింది.
చేతుల్లోనే ప్రయోగం..
సంప్రదాయ ఇంటర్‌సెప్టర్ డ్రోన్లకు ఇది భిన్నం. తుపాకీ మాదిరి పరికరం సాయంతోనే ఈ చిన్న డ్రోన్‌ను ప్రయోగించవచ్చు. కృత్రిమ మేధతోపాటు కెమెరా, సెన్సర్లను ఉపయోగించుకొని శత్రు డ్రోన్లను స్వయంగా ట్రాక్ చేస్తుంది. ఇందులో పేలుడు పదార్థం ఏమీ ఉండదు. అత్యంత వేగంతో వెళ్లి లక్షిత డ్రోన్లను గాల్లోనే ఢీకొట్టి నాశనం చేస్తుంది. అందుకే.. ‘ఫైర్-అండ్-ఫర్గెట్’గా పేర్కొనే ఈ డ్రోన్ల ప్రాధాన్యం ఇటీవల పెరిగినట్లు తెలుస్తోంది.
స్తూపాకారంలో ఉండే యోల్కా డ్రోన్‌కు ఎక్స్ ఆకారంలో రెండు జతల రెక్కలు ఉంటాయి. గాల్లో ఎగరడంతోపాటు స్థిరంగా ఉండగలదు. వెనక భాగంలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్లు.. కదలడానికి, నిర్దిష్ట మార్గంలో వెళ్లేందుకు దోహదపడతాయి. గంటకు 200-250 కి.మీ వేగం దీని సొంతం.
తక్కువ ఖర్చు..
మూడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ ఇంటర్‌సెప్టర్ డ్రోన్ ఛేదించగలదని తెలుస్తోంది. చిన్నగా, తేలికగా ఉండే దీని ధర సుమారు 500 డాలర్లు అని అంచనా. యుద్ధ రంగంలో నిఘా డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి ఈ సరికొత్త ఆయుధాన్ని రష్యా రూపొందించినట్లు తెలుస్తోంది. గతేడాది మేలో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో ఈ పరికరం అందరి దృష్టిని ఆకర్షించింది.








