మెగా158 లేటెస్ట్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మెగా 158(Mega158)పై సినీ వర్గాల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వాల్తేరు వీరయ్య(Valtair veerayya) వంటి భారీ సక్సెస్ తర్వాత డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) మరోసారి చిరంజీవితో చేతులు కలపడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవల ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్లో కుటుంబ ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఉన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. మెగాస్టార్‌తో పాటు యువ నటి అనశ్వర రాజన్(Anaswara Rajesh) పాల్గొన్న ఈ ఎపిసోడ్ కథలో ముఖ్యమైన మలుపులకు బలమైన పునాది వేస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే తొలి దశ పనులు పూర్తి చేసుకున్న యూనిట్, జూన్ నెల నుంచి తదుపరి షెడ్యూల్‌ను తమిళనాడులోని అందమైన పొలాచ్చి ప్రాంతంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ షెడ్యూల్లో పలు కీలక సన్నివేశాలతో పాటు విజువల్‌గా ఆకట్టుకునే ఎపిసోడ్లను తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన పొలాచ్చి లొకేషన్లు సినిమాకు ప్రత్యేకమైన విజువల్ రిచ్‌నెస్‌ను తీసుకురానున్నాయని చిత్ర యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమాను టెక్నికల్ గా మరింత ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు డైరెక్టర్ బాబీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ నిర్మాణ విలువలు, కమర్షియల్ అంశాలు, భావోద్వేగ కథనం కలయికగా ఈ సినిమా రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) తెలుగులో తమ తొలి సినిమాగా దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గ స్థాయిలో ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది.







