2028 లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ భారీ స్కెచ్!
వచ్చే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త సంస్థాగత వ్యూహానికి తెరలేపింది. సాధారణంగా కేడర్‌కు ఇచ్చే పార్టీ పదవులను ఈసారి నేరుగా గెలిచిన ప్రజాప్రతినిధులకే కట్టబెడుతోంది. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే వ్యక్తం చేస్తున్న ధీమా వెనుక ఈ పక్కా సంస్థాగత ప్రణాళికే కారణమని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్షాళన ప్రక్రియను పార్టీ అధిష్టానం ఏడాది కిందటే ప్రారంభించింది. జనవరి 2024లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికైన బి. మహేష్ కుమార్ గౌడ్‌కు సెప్టెంబర్ 2024లో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కీలక పదవుల్లో ప్రజాప్రతినిధులకు పెద్దపీట వేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నల్గొండ ఎంపీ కె.రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, సి.వంశీకృష్ణలకు కట్టబెట్టింది. అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుదా ఎమ్మెల్యేలు వేడ్మ బొజ్జు, డాక్టర్ చిట్టెం పరిణికా రెడ్డి, డాక్టర్ మట్ట రాగమయిలను నియమించింది..
పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్ష పదవులను కూడా ప్రజాప్రతినిధులకే కేటాయించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను టీపీసీసీ ఓబీసీ సెల్ ఛైర్మన్‌గా, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను ఎస్టీ సెల్ అధిపతిగా నియమించారు. నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ బాధ్యతలు వహించారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పరిణికా రెడ్డి పేరును పరిశీలించినప్పటికీ, వ్యక్తిగత కారణాలతో ఆమె తిరస్కరించడంతో వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను ఆ పదవిలో నియమించారు.
ఇటీవల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌గా నియమించగా, జిల్లా స్థాయిలోనూ ఐదుగురు ఎమ్మెల్యేలను డీసీసీ అధ్యక్షులుగా నియమించారు. వారిలో బీర్ల ఐలయ్య, మేడిపల్లి సత్యం, చిక్కుడు వంశీకృష్ణ, వేడ్మ బొజ్జు , ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఉన్నారు.
ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు పార్టీ బాధ్యతలు ఇవ్వడం వెనుక ఉన్న సామాజిక, రాజకీయ కారణాలను టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను, ఆరోపణలను బలంగా ఎదుర్కోవాలంటే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ముందుకు రావడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పవర్ ఉన్న నేతలు కౌంటర్ ఇచ్చినప్పుడే దానికి ప్రాధాన్యత, విలువ ఉంటాయి. పదవులతో పాటు జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయి. ఇది క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది.
పార్టీ అధిష్టానం త్వరలోనే ఎంపీలు లేదా ఎమ్మెల్యేల నుంచి కనీసం ఇద్దరిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లు ఈ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కేవలం పార్టీ పదవులే కాకుండా, ప్రభుత్వం తరఫున ఇచ్చే పలు కీలక నామినేటెడ్ పోస్టులను కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించి, పార్టీ సంస్థాగత పునాదులను రాష్ట్రవ్యాప్తంగా మరింత పటిష్టం చేయాలనేది కాంగ్రెస్ ప్రణాళిక.








