ఐపీఎల్ 2027 లోనూ ధోని ఆడతాడా..? సీఎస్కే సంచలన ప్రకటన..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ ముగిసిన తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ భవిష్యత్తుపై క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ‘థాలా’ ఎంఎస్ ధోని(Ms Dhoni) రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే ప్రచారానికి తెరదించుతూ.. ఆయన ఐపీఎల్ 2027 సీజన్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉందంటూ సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ కీలక అప్డేట్ ఇచ్చారు. అదే సమయంలో ఐదుసార్లు కప్పు అందించిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను పదవి నుంచి తప్పించబోతున్నారనే వార్తలు చెన్నై అభిమానుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్ అంతటా ఎంఎస్ ధోని బరిలోకి దిగకుండా కేవలం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. బొటనవేలి గాయం (Thumb Injury) కారణంగా ఆయన మైదానంలోకి రాలేదు. దీంతో ధోని కెరీర్‌కు ముగింపు పడినట్లేనని అందరూ భావించారు. అయితే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. “ధోని వచ్చే సీజన్లో (IPL 2027) ఆడుతాడనే నా నమ్మకం. మేము ఇంకా ఆయనతో అధికారికంగా మాట్లాడలేదు కానీ, అతను మళ్లీ వస్తాడని ఆశిస్తున్నాం. ఎందుకంటే తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను చెన్నై వేదికగానే ఆడతానని ఆయన గతంలో అభిమానులకు మాట ఇచ్చారు” అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
దీంతో ధోని ఫ్యాన్స్‌కు మళ్లీ ఆశలు చిగురించాయి. ధోని రీ-ఎంట్రీ వార్త ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తున్నా.. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ భవిష్యత్తు మాత్రం ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. అంతేకాకుండా గత మూడు సీజన్లుగా సీఎస్కే కనీసం నాకౌట్ దశకు కూడా అర్హత సాధించలేకపోయింది. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన జట్లలో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత దారుణమైన విన్/లాస్ రేషియో చెన్నైదే కావడం గమనార్హం. ఈ వైఫల్యాల నేపథ్యంలో మేనేజ్మెంట్ ఫ్లెమింగ్‌ను తొలగించాలని భావిస్తోందనే పుకార్లు షికారు చేస్తున్నాయి.
అయితే దీనిపై మేనేజ్మెంట్ స్పందిస్తూ.. క్రికెట్ పరమైన నిర్ణయాలపై ఇంకా ఎలాంటి సమీక్ష జరపలేదని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తీసుకురాబోతున్నారంటూ వస్తున్న వార్తలను సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ పూర్తిగా ఖండించారు. ద్రవిడ్‌తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫ్లెమింగ్ అమెరికాలోని టెక్సాస్ సూపర్ కింగ్స్, జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ జట్లతో బిజీగా ఉండటం వల్ల, జూన్ తర్వాతే కోచింగ్ మార్పులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ, జట్టులో ఎలాంటి మార్పులు జరిగినా ధోని సమ్మతితోనే జరుగుతాయని, ధోని ఎల్లప్పుడూ సీఎస్కే స్టోరీలో కేంద్ర బిందువుగా ఉంటారని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి







