ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆటా నాయకులు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) నాయకులు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి, బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, మాజీ అధ్యక్షుడు భువనేష్ బూజాల, కాన్ఫరెన్స్ నేషనల్ డైరెక్టర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ లోకల్ కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి మునుకుంట్ల చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా ఆటా నాయకులు ప్రవాసాంధ్రులకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం సాధిస్తున్న అద్భుతమైన విజయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. వ్యాపార, సాంకేతిక, ప్రజా సేవా రంగాలలో తెలుగువారు మరింతగా రాణించి, ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్ కమ్యూనిటీగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆటా మహాసభలకు తనను ఆహ్వానించినందుకు ఆటా నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, కాన్ఫరెన్స్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తన షెడ్యూల్‌ను బట్టి ఈ మహాసభలకు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు.







