విశ్వంభర మూవీపై లేటెస్ట్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న భారీ ఫాంటసీ మూవీ విశ్వంభర(Vishwambhara) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు చాలా కాలం క్రితమే పూర్తయినప్పటికీ, సినిమా విడుదల మాత్రం వరుస అడ్డంకుల కారణంగా ఆలస్యమవుతోంది. మొదట ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని నిర్మాతలు, ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే జూలై రిలీజ్ దాదాపు అసాధ్యంగా మారినట్టు టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సినిమాకు కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తికాకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ వీఎఫ్ఎక్స్ ఔట్పుట్ కోసం మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారీ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న విశ్వంభరలో విజువల్స్ అత్యంత కీలకమని భావించిన టీమ్, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే నిర్ణయంతో ఉంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర(Hari gowra) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేసే దశలో ఉన్నారు. VFX షాట్స్ ఫైనల్ అయిన తర్వాతే దర్శకుడు మరియు నిర్మాతలు పూర్తి ఎడిట్‌ను లాక్ చేయనున్నారని సమాచారం. అనంతరం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ఓటీటీ డీల్‌ను క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం విశ్వంభర రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేకపోవడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో సరైన రిలీజ్ స్లాట్ ఎంపిక కూడా నిర్మాతలకు సవాల్‌గా మారింది. అన్ని అడ్డంకులను అధిగమించి, అత్యుత్తమ అవుట్‌పుట్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో టీమ్ పనిచేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.







