బాలీవుడ్ లో పెద్ది పెర్ఫార్మెన్స్ మీదే అందరి కన్ను
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా పెద్ది(Peddi)పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయడానికి చిత్రబృందం స్పెషల్ ప్లాన్ తో ముందుకెళ్తోంది. ముఖ్యంగా ఉత్తర భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్(Janhvi kapoor)తో పాటు నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata satish kilaru), సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman), నటుడు బోమన్ ఇరానీ(Boman irani) కూడా ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
ఇటీవల భోపాల్‌లో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి వచ్చిన భారీ రెస్పాన్స్ మేకర్స్ కు మరింత నమ్మకాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరవ్వడం సినిమాపై నార్త్ సర్కిల్స్‌లో ఆసక్తి పెరిగిందనే సంకేతాలను ఇస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి బజ్ తీసుకురావడంతో పెద్ది కంటెంట్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
ఇక ఈ సినిమాను ఉత్తర భారతదేశంలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి జియో స్టూడియోస్(Jio studios) రంగంలోకి దిగింది. పుష్ప2(Pushpa2) తర్వాత ఒక సౌత్ సినిమాకు రికార్డు స్థాయి స్క్రీన్ కౌంట్ దక్కే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రామ్ చరణ్‌కు ఏర్పడిన పాన్ ఇండియా ఇమేజ్, జాన్వీ కపూర్ గ్లామర్, ఏఆర్ రెహమాన్ సంగీతం కలిసి సినిమాకు అదనపు బలం అవుతున్నాయి. జూన్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా సాలిడ్ స్టార్ట్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.







