గోదావరి ప్రక్షాళనకు పవన్ కల్యాణ్ భారీ యాక్షన్ ప్లాన్.. కాలుష్యంపై కఠిన చర్యలు..
పవిత్ర గోదావరి (Godavari) నది పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో నది పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల రాజమహేంద్రవరం (Rajamahendravaram) పర్యటన సందర్భంగా గోదావరిలో భారీ స్థాయిలో కలుషిత జలాలు చేరుతున్న దృశ్యాలను ప్రత్యక్షంగా గమనించిన పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
భక్తులు పవిత్ర స్నానాలు చేసే నది కాలుష్యంతో నిండిపోవడం ఆందోళనకరమని భావించిన ఆయన వెంటనే అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తొలి దశలో రూ.100 కోట్లతో గోదావరిలోకి మురుగునీరు చేరకుండా అడ్డుకునే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పారిశ్రామిక వ్యర్థాలు, పట్టణ మురుగు, ఆక్వా కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అధికారులు గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల్లో విస్తృత సర్వే నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి ఏ స్థాయిలో కాలుష్యం నదిలోకి చేరుతోందో గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం రోజుకు 100 మిలియన్ లీటర్లకు పైగా మురుగునీరు గోదావరిలో కలుస్తోందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా లక్షల లీటర్ల వ్యర్థ జలాలు నదిలోకి చేరుతున్నట్లు వెల్లడైంది.
పారిశ్రామిక కాలుష్యం కూడా ఆందోళనకర స్థాయిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్ర పేపర్స్ (Andhra Papers) వంటి పరిశ్రమల నుంచి భారీగా వ్యర్థ జలాలు విడుదలవుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా కోనసీమ (Konaseema), పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాల్లో ఆక్వా పరిశ్రమల వల్ల కూడా కాలుష్యం పెరుగుతోందని తేల్చారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని “స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు” పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. గోదావరి తీర ప్రాంతంలోని 262 గ్రామ పంచాయతీలను “పుష్కర పంచాయతీలు”గా గుర్తించి మురుగురహిత గ్రామాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో మురుగు నీటి నియంత్రణ కోసం మ్యాజిక్ డ్రైన్లు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇక పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ నుంచి భారీగా మురుగు నీరు నేరుగా గోదావరిలో కలుస్తోందని నివేదికలో వెల్లడైంది. తణుకు (Tanuku), భీమవరం (Bhimavaram), నరసాపురం (Narasapuram), కొవ్వూరు (Kovvur) వంటి పట్టణాల నుంచి కూడా డ్రెయిన్ల ద్వారా వ్యర్థ జలాలు నదిలోకి చేరుతున్నాయి.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రతి మున్సిపాలిటీలో మురుగు శుద్ధి కేంద్రాలు (STPలు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలుష్య నియంత్రణపై నిరంతర నిఘా కోసం ఆర్టీజీఎస్ (RTGS) తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత సహాయంతో పరిశ్రమలు, మున్సిపాలిటీల నుంచి విడుదలయ్యే మురుగు నీటిపై ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించనున్నారు. గోదావరి పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.







