కాలిఫోర్నియాలో రామ్ మిరియాల లైవ్ కాన్సెర్ట్.. మిల్పిటాస్లో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన మ్యూజికల్ నైట్!
BAE: అమెరికాలోని బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ (BAE) సంస్థ సంగీత ప్రియుల కోసం చిరస్మరణీయ ఉత్సాహభరితమైన సంగీత విభావరిని విజయవంతంగా నిర్వహించింది. కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్ వేదికగా 2026 మే 22 శుక్రవారం నాడు “వైబ్ విత్ సింగర్ రామ్ మిరియాల లైవ్” (Vibe with Singer Ram Miriyala Live) కాన్సెర్ట్‌ను అట్టహాసంగా ఏర్పాటు చేశారు. టాలీవుడ్ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, చౌరస్తా బ్యాండ్ ఫౌండర్ రామ్ మిరియాల పాటల ప్రదర్శన కోసం బే ఏరియా నలుమూలల నుండి అభిమానులు, సంగీత ప్రియులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఈ ఈవెంట్ అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల కేరింతలు, కేరింతల శబ్దాలతో ఆడిటోరియం అంతా రోజంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి మై పర్సూ (Gold Sponsor), నాగరాజ్ అన్నయ్య (Powered By), కావ్య ఫుడ్స్, అపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, ఇన్‌స్టా సర్వీస్ (Silver Sponsors), సితార ఇండియన్ క్యూసిన్ (Food Sponsor) వ్యవహరించారు.
అద్భుతమైన బ్యాండ్ ప్రదర్శన…
రామ్ మిరియాల తన అద్భుతమైన బ్యాండ్ సభ్యులతో కలిసి వేదికపై లైవ్ ప్రదర్శన ఇస్తూ మొదటి నుండి చివరి వరకు ప్రేక్షకులను తన పాటల మాయాజాలంలో ముంచెత్తారు. బ్యాండ్ లోని ప్రతి ఒక్కరు పూర్తి ఎనర్జీతో ప్రదర్శన ఇవ్వడం వల్ల అక్కడి వాతావరణం మరింత వైబ్రెంట్‌గా మారింది. ముఖ్యంగా రామ్ మిరియాల తన అవార్డు విన్నింగ్ సూపర్ హిట్ సాంగ్ “చిట్టి” ని పాడినప్పుడు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేక్షకులు థియేటర్ లో డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఎంజాయ్ చేశారు. దీనితో పాటు ఆయన పాడిన మరికొన్ని హృదయాన్ని హత్తుకునే మెలోడీలు, రొమాంటిక్ సాంగ్స్ మాస్ నంబర్లు రాత్రి వేళల్లో జోష్‌ను మరింత పెంచాయి.
ఇవి కూడా చదవండి

నాన్‌స్టాప్‌గా కాన్సెర్ట్…
ఈ షోలో పాటల ఎంపిక వాటి క్రమం ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేయడం వల్ల మొదటి పాట నుండి చివరి పాట వరకు అదే లయ, అదే ఎనర్జీ కొనసాగింది. అర్ధరాత్రి వరకు నాన్‌స్టాప్‌గా సాగిన ఈ కాన్సెర్ట్ ప్రతి ఒక్కరినీ విపరీతంగా అలరించింది. ఈ ప్రధాన కార్యక్రమానికి ముందు స్థానిక బే ఏరియా బ్యాండ్ ‘6th Element’ ఇచ్చిన ఓపెనింగ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని, ఈ మ్యూజికల్ నైట్‌కు ఒక మంచి పునాదిని వేసింది. రామ్ మిరియాలా బే ఏరియాకు రావడం ఇది మూడవసారి కాగా, ప్రతి పర్యటనకు ఆయనను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య వారి ఉత్సాహం భారీగా పెరుగుతోందని, అమెరికాలోని తెలుగు ఆడియన్స్ లో ఆయనకు ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ ఈవెంట్‌ను ఇంతటి గ్రాండ్ సక్సెస్ చేసిన బే ఏరియా తెలుగు కమ్యూనిటీకి బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ (BAE) నిర్వాహకులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులు, వాలంటీర్లు, స్పాన్సర్లు, కళాకారులు, మద్దతుదారులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. బే ఏరియాలోని తెలుగువారితో పాటు ఇతరుల కోసం ఇలాంటి ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను భవిష్యత్తులోనూ అందిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా బీఏఈ సంస్థ తన నిబద్ధతను చాటుకుంది.
ఇవి కూడా చదవండి







