విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌తో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం
PM Internship Scheme:పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారితో పాటు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం’ ద్వారా అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకం అమలు బాధ్యతలను రాష్ట్రాల పరిశ్రమల శాఖలు పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటివరకు మూడు విడతల్లో జరిగిన ఈ ప్రక్రియ ద్వారా సుమారు 2,800 మందికి పైగా విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు వివిధ పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు పొందారు.
వివరాలు..
దరఖాస్తు ప్రక్రియ..
ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉండాలి. వెబ్సైట్లో తమ రాష్ట్రం, జిల్లాలను ఎంచుకుంటే అక్కడ అందుబాటులో ఉన్న కంపెనీల వివరాలు కనిపిస్తాయి. విద్యార్థులు తమకు తగిన పరిశ్రమలను ఎంపిక చేసుకుంటే, సదరు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
6 నెలల నుండి 9 నెలల వరకు శిక్షణ..
ఎంపికైన వారికి 6 నెలల నుండి 9 నెలల వరకు శిక్షణ ఇస్తారు. ఈ కాలంలో నైపుణ్యాలు నేర్పించడంతో పాటు నెలకు రూ. 9 వేల ఉపకార వేతనం (స్టైపెండ్) అందిస్తారు. కొన్ని పరిశ్రమలు ఉచితంగా భోజన వసతి కూడా కల్పిస్తాయి. చమురు సంస్థలు , ప్రభుత్వ రంగ సంస్థలు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు..
అభ్యర్థులకు గరిష్టంగా మూడు సార్లు ఇంటర్న్‌షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేటాయించిన పరిశ్రమ చాలా దూరంగా ఉంటే దానిని తిరస్కరించే వీలుంది. శిక్షణ సమయంలో ప్రతిభ కనబరిచిన వారికి శిక్షణ పూర్తి కాకముందే మహీంద్రా, రెడ్డీస్ ల్యాబ్స్ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వీరికి వర్తించదు..
ఈ పథకం కేవలం సాధారణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే వారి కోసం మాత్రమే ఉద్దేశించింది. ఐఐటీ (IIT), ఐఐఎం (IIM), ఐఐఐటీ (IIIT), మెడికల్ (వైద్య) విద్యార్థులు, నల్సార్ వంటి ప్రతిష్టాత్మక న్యాయ విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఇది వర్తించదు. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ (CA), ఎంబీఏ (MBA), ఎంఫిల్ (M.Phil), పీహెచ్డీ (PhD) పూర్తి చేసిన వారికి కూడా ఈ పథకంలో అవకాశం ఉండదు.
మూడు దశల వివరాలు:
ఈ పథకం కింద అప్లికేషన్ల ప్రక్రియ మూడు దశల్లో సాగింది. తొలిదశలో 24,800 దరఖాస్తులు రాగా, 7,675 మంది అర్హత సాధించారు, వారిలో 1,376 మంది కంపెనీల్లో చేరారు. మలిదశలో 27,201 దరఖాస్తులకు గాను 5,358 మంది అర్హత సాధించగా, 1,309 మంది విధుల్లో చేరారు. ఇక మూడోదశలో 4,927 దరఖాస్తులు రాగా, 310 మంది అర్హత సాధించి, 122 మంది కంపెనీల్లో జాయిన్ అయ్యారు.







