ఆటా మహాసభలకు రండి… ముఖ్యమంత్రి రేవంత్ ను ఆహ్వానించిన ఆటా నాయకులు
మేరీల్యాండ్ లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా తెలుగు మహాసభలకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆటా నాయకులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ఈ మహాసభలకు జరగనున్నాయి. ఈ మహాసభలకు అమెరికా నలుమూలల నుంచి, భారత్ నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని ఆటా నాయకులు హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా వారు ఆటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా మహాసభల గురించి వివరించి ఈ మహాసభలకు అమెరికా స్థానిక గవర్నర్ లు, పలువురు నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఎన్నారైలు దత్తత అంశంపై నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల సీఎంకు వివరించారు. సీఎం హోదాలో ఆటా సభలకు హాజరు కావాలని కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
సీఎం ని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







