ఇంట్లో పెంచుకునే మొక్కలు అందాన్ని పెంచడంతో పాటు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. అయితే సరైన సంరక్షణ లేకపోతే మొక్కలకు చీడపీడలు, పురుగులు సోకే ప్రమాదం ఉంటుంది.
దీనికి మొక్కలకు ఎక్కువగా నీరు పోయడం ఒక ప్రధాన కారణంగా చెప్పొచ్చు. మట్టి ఎప్పుడూ తడిగా ఉండటం వల్ల ఫంగస్, చిన్న పురుగులు పెరిగే అవకాశం ఉంటుంది.
సూర్యరశ్మి సరిగా అందకపోయినా మొక్కలు బలహీనపడతాయి. బలహీనమైన మొక్కలకు చీడపీడలు త్వరగా సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎండిపోయిన ఆకులు, చెడు కొమ్మలను తొలగించకుండా వదిలేస్తే పురుగులు పెరుగుతాయి. అందుకే మొక్కలను తరచూ పరిశీలించడం, క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.
మొక్కల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. నీరు ఎక్కువసేపు నిలిస్తే వేర్లు కుళ్లిపోవడంతో పాటు దోమలు, పురుగులు వస్తాయి.
వేపనూనె (Neem Oil) లేదా పుల్లటి మజ్జిగ నీటిని స్ప్రే చేయడం సహజమైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది. ఇది మొక్కలకు హాని చేయకుండా పురుగులను తగ్గించడంలో సహాయపడుతుంది.
కొత్తగా తీసుకొచ్చిన మొక్కలను వెంటనే ఇతర మొక్కల దగ్గర పెట్టకూడదు. ముందుగా కొన్ని రోజులు వేరుగా ఉంచి పరిశీలించడం మంచిది.
మొక్కలకు సరైన గాలి, వెలుతురు అందేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి చీడపీడల సమస్య తగ్గుతుంది.
చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఇంటి మొక్కలను పురుగుల నుంచి సురక్షితంగా కాపాడుకోవచ్చు. సరైన సంరక్షణతో మొక్కలు ఎప్పుడూ పచ్చగా, అందంగా కనిపిస్తాయి.