క్రెడిట్ కార్డ్ ఉందా? అయితే ఏటీఎం వెళ్లకుండానే క్యాష్ పొందే స్మార్ట్ ట్రిక్స్ ఇవే
Credit Card: అత్యవసర సమయాల్లో చేతిలో అస్సలు నగదు లేనప్పుడు క్రెడిట్ కార్డ్‌లు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం వీసా, మాస్టర్ కార్డ్‌లతో పాటు యూపీఐ సదుపాయం ఉన్న రూపే క్రెడిట్ కార్డ్‌లను కూడా చాలా మంది వాడుతున్నారు. అయితే, క్రెడిట్ కార్డ్ ఉపయోగించి నేరుగా ఏటీఎం నుండి డబ్బులు విత్‌డ్రా చేస్తే భారీగా అదనపు సర్వీస్ ఛార్జీలు, విత్‌డ్రా చేసిన రోజు నుంచే అధిక వడ్డీలు పడతాయనే భయం చాలా మందిలో ఉంటుంది. కానీ, ఏటీఎం మెషిన్ జోలికి వెళ్లకుండానే, ఎలాంటి భారీ ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను సులభంగా బ్యాంక్ ఖాతాలోకి మార్చుకోవచ్చు.
ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్..
ప్రస్తుతం చాలా బ్యాంకులు తమ అధికారిక మొబైల్ యాప్స్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డ్ నుండి నేరుగా బ్యాంక్ అకౌంట్‌కి డబ్బు బదిలీ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. దీనికోసం ముందుగా మీ బ్యాంక్ వెబ్సైట్ లేదా యాప్‌లోకి లాగిన్ అయి, ‘క్యాష్ ట్రాన్స్ఫర్’ సెక్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ సూచించిన స్టెప్స్ ఫాలో అవుతూ సులభంగా మనీ ట్రాన్స్ఫర్ పూర్తి చేయవచ్చు. అయితే ఈ సేవలను ఉపయోగించే ముందు, మీ క్రెడిట్ కార్డ్‌పై ఈ ఫెసిలిటీ యాక్టివ్‌గా ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
ఇ-వాలెట్ ద్వారా సులువైన బదిలీ..
మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ వాలెట్ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డ్ మనీని బ్యాంక్ ఖాతాలోకి మార్చుకోవడం సరికొత్త పేమెంట్ పద్ధతిగా మారింది. ఇందుకోసం మీ ఫోన్లోని ఇ-వాలెట్ యాప్‌లోకి లాగిన్ అయి, పాస్‌బుక్ సెక్షన్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ‘సెండ్ మనీ టు బ్యాంక్’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని, అవసరమైన బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సీ (IFSC) కోడ్ వంటి వివరాలను నమోదు చేసి, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ పూర్తి చేసి డబ్బును ఖాతాలో జమ చేసుకోవచ్చు.
ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసెస్..
వెస్ట్రన్ యూనియన్ , మనీగ్రామ్ వంటి అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసుల ద్వారా కూడా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మనీ ట్రాన్స్ఫర్ పూర్తి చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఉచితంగా రిజిస్టర్ చేసుకుని, డబ్బు పంపాల్సిన వ్యక్తి పేరు, దేశాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ‘బ్యాంక్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై రిసీవర్ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎంటర్ చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ పూర్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ ముగిశాక MTCN నంబర్ గల కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. ఈ పద్ధతిలో డబ్బులు అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి 1 నుండి 5 పనిదినాల సమయం పడుతుంది.
నేరుగా క్యాష్ విత్‌డ్రా..
పైన పేర్కొన్న ఏ ఆప్షన్లు అందుబాటులో లేనప్పుడు, చివరి ప్రయత్నంగా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏటీఎం మెషిన్ ద్వారా నేరుగా క్యాష్ విత్‌డ్రా చేయవచ్చు. అయితే, ఈ పద్ధతిలో విత్‌డ్రా చేసిన మొత్తంపై బ్యాంకులు వెంటనే సర్వీస్ ఛార్జీలు, వడ్డీలను విధిస్తాయి. ఏటీఎం నుండి విత్‌డ్రా చేసిన నగదును ఆ తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ మిగిలిన ఆన్లైన్ పద్ధతులతో పోలిస్తే దీనికి ఖర్చు ఎక్కువ కాబట్టి, అత్యంత అనివార్యమైన పరిస్థితుల్లోనే ఈ మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం.







