ఆర్థిక అనిశ్చితిలో ఆందోళన లేకుండా.. మీ సంపదను కాపాడుకోండి ఇలా!
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అడ్డంకులు ద్రవ్యోల్బణం కారణంగా భవిష్యత్తులో ఆర్థిక మందగమనం తప్పదనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో అప్రమత్తంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఊహించని విధంగా ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తే, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కింది అంశాలపై దృష్టి పెట్టడం అవసరం.
అత్యవసర నిధిని పెంచుకోండి
సాధారణ రోజుల్లో 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు చేతిలో ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతుంటారు. కానీ ప్రస్తుత మార్కెట్ సవాళ్ల దృష్ట్యా కొత్త ఉద్యోగం రావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కాబట్టి ఈ అత్యవసర నిధిని కనీసం 6 నుండి 9 నెలలకు లేదా వీలైతే ఏడాది కాలానికి పెంచుకోవడం ఉత్తమం.
పొదుపు వ్యూహం: దీని కోసం ప్రతి నెల వస్తున్న జీతంలో కనీసం 25-30 శాతం వరకు రికరింగ్ డిపాజిట్ (RD) లేదా లిక్విడ్ ఫండ్స్‌లో దాచాలి.
ఫ్లెక్సిబిలిటీ: మీ దగ్గర ఇప్పటికే అత్యవసర డబ్బు ఉంటే, దానిని అవసరమైనప్పుడు వెంటనే తీసుకునే వీలుండే ఫ్లెక్సిబుల్ ఫిక్స్డ్ డిపాజిట్లలోకి మార్చుకోవడం మంచిది. ఒకవేళ ఉద్యోగం పోయినా ఈ నిధి నుండి నెలనెలా జీతంలాగా డబ్బు వాడుకోవచ్చు.
రుణాలకు వీలైనంత దూరం
ఉద్యోగ భద్రతపై నమ్మకం లేనప్పుడు కొత్త అప్పులు చేయకుండా ఉండటమే క్షేమం. చేతిలో ఉన్న నిధులతోనే కాలాన్ని వెళ్లదీయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా తగ్గించుకోవడం మంచిది. ఆదాయం లేని సమయంలో కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే వడ్డీ రేట్లు భారీగా పెరిగి, మీ క్రెడిట్ స్కోరు తీవ్రంగా దెబ్బతింటుంది.
విచక్షణతో ఖర్చులు తగ్గించుకోండి
మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఇంధన ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ నెలవారీ బడ్జెట్‌పై వ్యర్థ వ్యయాల ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి.
గ్లోబల్ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువులతో పాటు ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ నెలవారీ బడ్జెట్‌పై వ్యర్థ వ్యయాల ప్రభావం పడకుండా జాగ్రత్త పడాలి. ఇందులో భాగంగా ఖరీదైన వస్తువుల కొనుగోళ్లు, విలాసవంతమైన ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అలాగే రవాణా ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సొంత వాహనాల వాడకాన్ని తగ్గించి, వీలైనంత వరకు ప్రజారవాణా (పబ్లిక్ ట్రాన్స్పోర్ట్) ఉపయోగించడం వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి.
సొంతంగా ఆరోగ్య బీమా
చాలా మంది కంపెనీలు ఇచ్చే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్‌పైనే ఆధారపడుతుంటారు. కానీ ఉద్యోగం మారినప్పుడు లేదా కోల్పోయిన మరుసటి రోజు నుంచే ఆ హెల్త్ కార్డ్ పని చేయదనే విషయం మరవద్దు. ఆ సమయంలో అనారోగ్య సమస్యలు వస్తే పొదుపు మొత్తం హాస్పిటల్ బిల్లులకే ఖర్చవుతుంది. కాబట్టి మీ కుటుంబ రక్షణ కోసం విడిగా 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు సొంతంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం ఎంతో అవసరం.
పెట్టుబడులను వెనక్కి తీసుకోవద్దు
మార్కెట్ పతనానికి భయపడి లేదా ఆదాయం కోల్పోయామని ఒకేసారి మీ దీర్ఘకాలిక పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరికాదు. యుద్ధాలు, మార్కెట్ నష్టాలు తాత్కాలికం మాత్రమే. ఏదైనా ఇబ్బంది వస్తే మొదట అత్యవసర నిధిని మాత్రమే వాడుకోవాలి. అత్యంత తీవ్రమైన, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే భవిష్య నిధి (PF), ఈక్విటీలు లేదా మ్యూచువల్ ఫండ్ల నుండి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి.







