పెద్ది క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కించిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో చేసిన పెర్ఫార్మెన్స్కు కచ్ఛితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని శివరాజ్ కుమార్ నమ్మకం వ్యక్తం చేశారు. పాత్ర కోసం దాదాపు రెండేళ్ల పాటు పూర్తిగా ఆ పాత్రలో మునిగిపోయి పనిచేసిన చరణ్ అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు అత్యంత నిబద్ధతతో నటించాడని ఆయన వెల్లడించారు.
ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గౌర్నాయుడు అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర కథలో కోచ్‌లా మార్గనిర్దేశం చేసే వ్యక్తిగా ఉంటుందని సమాచారం. గౌర్నాయుడు-పెద్ది మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఆడియన్స్ ను బలంగా కట్టిపడేస్తుందని శివరాజ్ కుమార్ తెలిపారు. షూటింగ్ టైమ్ లో రామ్ చరణ్‌తో పాటు మొత్తం యూనిట్ తనను కుటుంబ సభ్యుడిలా చూసుకుందని చెప్పిన ఆయన, ఆ అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు(Jagapathi Babu) పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారని ఆయన ప్రశంసించారు.
ఇక డైరెక్టర్ బుచ్చిబాబు సాన కథను తీర్చిదిద్దిన తీరు, స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌ను కథలో మిళితం చేసిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను పూర్తిగా షాక్‌కు గురి చేస్తుందని, థియేటర్లలోనే ఆ ఎమోషన్‌ను ఆస్వాదించాలని శివరాజ్ కుమార్ సూచించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాతో రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయి నమోదవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.







