రిషభ్ పంత్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్..? లక్నో టీమ్‌లో భారీ మార్పులు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జాయింట్స్ (LSG) జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెప్టెన్సీ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర డైలామాలో పడింది. ఈ సీజన్లో లక్నో జట్టు ఘోర ప్రదర్శన చేయడంతో టీమ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ మార్పుపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరతో రిషభ్ పంత్‌ను(Rishab Pant) లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా.. ఎంఎస్ ధోనీ(Ms Dhoni), రోహిత్ శర్మల(Rohith Sharma) తరహాలో పంత్ తమ జట్టును నడిపిస్తాడని భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ నమ్మకం నిజం కాలేదు. పంత్ నేతృత్వంలో లక్నో జట్టు గత రెండు సీజన్లలో కలిపి ఆడిన 28 మ్యాచ్‌ల్లో కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. 2025లో 7వ స్థానంలో నిలిచిన లక్నో.. ఈ 2026 సీజన్లో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది. పంత్ కెప్టెన్సీ ఒత్తిడి అతని బ్యాటింగ్‌పై కూడా పడిందని, గత రెండు సీజన్లలో అతను 135.74 స్ట్రైక్ రేట్‌తో కేవలం 581 పరుగులు మాత్రమే చేయగలిగాడని విమర్శలు వస్తున్నాయి.
పంత్ బ్యాడ్ పీరియడ్ కేవలం ఐపీఎల్‌కే పరిమితం కాలేదు. ఇటీవలే అతను భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీని కెఎల్ రాహుల్‌కు కోల్పోవడమే కాకుండా, వన్డే జట్టులోనూ చోటు సంపాదించలేకపోయాడు. లక్నో జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ టామ్ మూడీ స్పందిస్తూ.. “కెప్టెన్‌గా పంత్ ఈ సీజన్లో చాలా ఇబ్బంది పడ్డాడు, ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయి. మేము ఆశించిన ప్రమాణాలను అందుకోలేకపోయాం. కాబట్టి లీడర్షిప్ రీసెట్ అనేది ప్రస్తుతానికి చాలా అవసరం” అని స్పష్టం చేశారు. దీంతో వచ్చే సీజన్ నాటికి లక్నో జట్టుకు కొత్త కెప్టెన్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.







