మే 30న అట్లాంటాలో శ్రీవిద్య ఉపాసన సదస్సు
అమెరికా జార్జియా రాష్ట్రంలోని ప్రవాస తెలుగు సమాజ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ‘అట్లాంటా తెలుగు సంఘం’ (TAMA) ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘దేవీపురం’ సంయుక్తంగా ఒక విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికను సిద్ధం చేశాయి. శ్రీవిద్య రహస్యాలను, సనాతన ధర్మ విశేషాలను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించేందుకు “శ్రీవిద్య ఉపాసన పరిచయ సదస్సు” (Sri Vidya Teaching Tour – An Introduction to Sacred Sri Vidya Upasana) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ విశిష్ట సదస్సు 2026 మే 30వ తేదీ శనివారం నాడు సువానీ నగరంలో జరగనుంది.
ఆధ్యాత్మిక సదస్సు ప్రధాన వివరాలు:
తేదీ: మే 30, 2026 (శనివారం)
సమయం: సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు
వేదిక: శిరిడీ సాయి టెంపుల్ (Shirdi Sai Temple), 700 జేమ్స్ బర్గెస్ రోడ్, సువానీ, జార్జియా (GA 30024), అమెరికా.
విశేష ప్రసంగాలు:
ప్రపంచంలోనే అన్ని ఖడ్గమాల దేవీల విగ్రహాలు కలిగిన ఏకైక ఏకశిలా శ్రీచక్ర మహామేరు క్షేత్రం ‘దేవీపురం’ వ్యవస్థాపకులు, సైంటిస్ట్ నుండి పరమహంసగా మారిన పూజ్య గురూజీ శ్రీ అమృతానంద నాథ సరస్వతి గారి కుమార్తెలు సీనియర్ శిష్యురాళ్లయిన రాధా మర్థి రమా కందర్ప ల పర్యవేక్షణలో ఈ తరగతులు నిర్వహిస్తారు. ప్రాచీన జ్ఞానాన్ని నేటి ఆధునిక ప్రపంచానికి ఎలా అన్వయించుకోవాలో, మన దైనందిన జీవితమే అత్యున్నత ఆరాధనగా ఎలా మార్చుకోవచ్చో వీరు వివరించనున్నారు.
ఈ మూడు గంటల సదస్సులో పాల్గొనే భక్తులకు విశేష అనుభూతులు లభిస్తాయి.
దేవీపురం విశిష్టత: ప్రపంచంలోనే అత్యంత అరుదైన దేవీపురం క్షేత్రం గురించిన విశేషాల వివరణ.
శ్రీచక్ర రహస్యాలు: మన శరీరమే ఒక శ్రీచక్రం (ఆలయం) అని, మన మనస్సులోని వివిధ భాగాలే దైవ స్వరూపాలని అర్థం చేసుకునే వివరణ.
గ్రూప్ కలవాహన పూజ: హాజరైన మహిళలను దేవీ స్వరూపాలుగా గౌరవిస్తూ సాగే అత్యంత అరుదైన శక్తివంతమైన ‘గ్రూప్ కలవాహన'(Group Kalavahana) పూజా విధానంలో పాల్గొనే అవకాశం.
ప్రశ్నోత్తరాల సమయం: శ్రీవిద్య తంత్ర సాధనలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు టీచర్లతో ముఖాముఖి.
రిజిస్ట్రేషన్, సంప్రదింపుల వివరాలు:
ఈ ఉపాసన తరగతులలో పాల్గొనడానికి ఆసక్తి గల వారు ఆటా అధికారిక ఆన్లైన్ లింక్ tama.org/srividyaupasana ద్వారా లేదా బ్రోషర్ లోని క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింది ప్రతినిధులను సంప్రదించవచ్చు:
పార్వతి కొంపెల్ల: (561) 359-4041
ప్రియా బాలుసు: (404) 993-0043
ఈ సదస్సును టామా (TAMA) ప్రెసిడెంట్ సునీతా పొట్నూరు, చైర్మన్ మధుకర్ యార్లగడ్డ ల పర్యవేక్షణలో.. కోర్ కమిటీ సభ్యులు తిరు చిల్లాపల్లి, సునీల్ దేవరపల్లి, వెంకట్ తెరాల, నాగేష్ దొడ్డక, రాఘవ తడవర్తిలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. జార్జియా పరిసర ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక ప్రియులు, ప్రవాస తెలుగు కుటుంబాలంతా పెద్ద సంఖ్యలో హాజరై ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టామా నిర్వాహక బృందం కోరింది.







