ఆగస్టులో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ‘స్వర్ణోత్సవ వేడుకలు’
అమెరికాలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రవాస తెలుగు సంఘాలలో ఒకటైన ‘హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి’ (HTCA) ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. సంస్థ స్థాపించి విజయవంతంగా యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ జూబ్లీ’ (Golden Jubilee 1976–2026) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహక బృందం సర్వం సిద్ధం చేస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ వేదికగా 2026 ఆగస్టు నెలలో రెండు రోజుల పాటు ఈ మహా సభలు అట్టహాసంగా జరగనున్నాయి.
తేదీలు: ఆగస్టు 7 మరియు ఆగస్టు 8, 2026(శుక్ర, శనివారాలు)
వేదిక: ఫోర్ట్ బెండ్ కౌంటీ ఎపికెంట్టర్ (Fort Bend County Epicenter), 28505 సౌత్‌వెస్ట్ ఫ్రీవే (Southwest Fwy), రోసెన్‌బర్గ్, టెక్సాస్ (TX 77471), అమెరికా.
శతాబ్దపు సగ భాగం.. అలుపెరుగని ప్రయాణం!
1976లో కొద్దిమంది తెలుగు వారితో చిన్నగా ప్రారంభమైన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, గడిచిన 50 ఏళ్లలో టెక్సాస్ పరిసర ప్రాంతాల్లోని వేలాది తెలుగు కుటుంబాలకు ఒక బలమైన వేదికగా ఎదిగింది. పరాయి దేశంలో ఉన్నప్పటికీ మన కట్టు, బొట్టు, భాష, సంప్రదాయాలను తరువాతి తరాలకు అందిస్తూ.. ఎన్నో సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా అమెరికాలోనే ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ హాఫ్ సెంచరీ పండుగను చిరస్మరణీయంగా మార్చేందుకు వీలుగా వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత విభావరి, ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలు, ప్రత్యేక వంటకాలతో కూడిన విందు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మెగా ఈవెంట్‌ను హెచ్టీసీఏ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డిల సమర్థవంతమైన పర్యవేక్షణలో, కమిటీ సభ్యులు, వాలంటీర్లు ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.







