రోజుకు కేవలం 7 రూపాయలతో.. నెలకు రూ. 5 వేల పెన్షన్ పొందండిలా
Atal Pension Yojana: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ సదుపాయం ఉంటుంది, కానీ అసంఘటిత రంగంలో పనిచేసే సామాన్యులకు అటువంటి రక్షణ ఉండదు. ఈ లోటు లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అటల్ పెన్షన్ యోజన’ (APY) పథకాన్ని ప్రవేశపెట్టింది. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించాలనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది ఈ పథకంలో చేరి తమ భవిష్యత్తుకు భరోసా కల్పించుకున్నారు.
అర్హతలు , చేరే విధానం..
ఈ పథకంలో చేరడానికి 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉన్నవారు దీనికి అర్హులు. అయితే, ఆదాయపు పన్ను చెల్లించే వారు లేదా ఇప్పటికే ఇతర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల్లో సభ్యులుగా ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. మీరు నేరుగా బ్యాంకుకు వెళ్లి లేదా ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా చాలా సులభంగా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు.
పెట్టుబడి , పెన్షన్ ప్రయోజనాలు..
చందాదారులు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ. 1,000 నుండి గరిష్టంగా రూ. 5,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. మనం ఎంచుకునే పెన్షన్ మొత్తం , మనం చేరిన వయస్సును బట్టి నెలవారీ ప్రీమియం మారుతుంది. ఉదాహరణకు, 18 ఏళ్ల వయసులో చేరిన వారు నెలకు కేవలం రూ. 42 నుండి రూ. 210 వరకు చెల్లిస్తే సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ. 291 నుండి రూ. 1,454 వరకు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.
కుటుంబానికి భరోసా..
ఈ పథకం ద్వారా కేవలం చందాదారుడికే కాకుండా వారి కుటుంబానికి కూడా రక్షణ లభిస్తుంది. ఒకవేళ పెన్షన్ పొందుతున్న సమయంలో చందాదారుడు మరణిస్తే, అదే పెన్షన్ మొత్తం వారి జీవిత భాగస్వామికి అందుతుంది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ మరణిస్తే, అప్పటి వరకు జమ అయిన మొత్తం కార్పస్‌ను (సుమారు రూ. 8.5 లక్షల వరకు) నామినీకి అందజేస్తారు.
సకాలంలో చెల్లించకపోతే జరిమానా..
ఈ పథకంలో ప్రీమియం చెల్లింపుల కోసం ఆటో డెబిట్ సౌకర్యం ఉంటుంది. అంటే ప్రతి నెలా మీ బ్యాంకు ఖాతా నుండి నిర్ణీత సొమ్ము దానంతట అదే కట్ అవుతుంది. ఒకవేళ సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే స్వల్ప జరిమానా విధిస్తారు. వరుసగా చెల్లింపులు ఆపేస్తే ఖాతా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే, అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో 60 ఏళ్ల కంటే ముందే పథకం నుండి తప్పుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. సంవత్సరానికి ఒకసారి మీ పెన్షన్ మొత్తాన్ని పెంచుకునే లేదా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఇవి కూడా చదవండి







