గ్రేటర్ కోటపై గులాబీ కన్ను!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, భాగ్యనగర రాజకీయం అప్పుడే వేడెక్కింది. జీహెచ్ఎంసీ పీఠంపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక స్థానాలను సాధించి తన పట్టును నిరూపించుకున్న బీఆర్ఎస్, అదే జోష్‌తో మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, ఓటర్ల జాబితా సవరణ నుంచి సభ్యత్వ నమోదు వరకు ప్రతి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, తమ పార్టీ సానుభూతిపరులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతు కాకుండా బీఆర్ఎస్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై పార్టీ శ్రేణులను పూర్తిగా అలర్ట్ చేసింది. ఈ నెల 25 నుంచి ఈ ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభం కానుండటంతో, ప్రతి డివిజన్, పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కేటీఆర్ ఆదేశించారు.
అయితే, ఈ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల లిస్ట్ ఇవ్వాలని అధిష్టానం ఆదేశించగా, మొత్తం 119 నియోజకవర్గాల్లో 38 నియోజకవర్గాల నుంచి ఇంకా లిస్ట్ అందకపోవడంపై ఇటీవల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్.. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గులాబీ క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, అర్హులైన ఓటర్ల వద్ద అవసరమైన అర్హత పత్రాలు ఉండేలా చూసే బాధ్యతను ఈ బీఎల్ఏలకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో వరుసగా రెండు సార్లు గ్రేటర్ మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఈ జిల్లాల్లోని ఓటర్లు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని భావించి, ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పాతబస్తీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మైనారిటీలు బీఆర్ఎస్ వైపే నిలిచారు. అందుకే, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా, లేని చోటా బూత్ ల వారీగా బీఎల్ఎలను నియమించి సానుకూల ఓట్లను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా, ప్రజల్లోనే ఉండాలని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలను కేటీఆర్ ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, తాగునీటి ఎద్దడి, దెబ్బతిన్న రోడ్లు, స్థానిక మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు… లాంటి వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దీనితో పాటు, డిజిటల్ పద్ధతిలో ప్రతి ఇంటిని టచ్ చేస్తూ ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఎన్నికలకు ముందే వ్యూహాత్మక అడుగులు వేస్తూ, కేడర్‌లో జోష్ నింపుతున్న గులాబీ బాస్ ల చర్యలు గ్రేటర్ రాజకీయాల్లో సరికొత్త వేడిని పుట్టిస్తున్నాయి. రాబోయే మున్సిపల్ పోరులో గ్రేటర్ కోటపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి







