వారణాసి మ్యూజిక్ పై కీరవాణి లేటెస్ట్ అప్డేట్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(rajamouli) తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా వారణాసి (varanasi)పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా, ఇప్పుడు ఆ టార్గెట్ కు అనుగుణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మ్యూజిక్ కేటగిరీలో వర్క్స్ ముందుగానే మొదలు కానుండటంతో సినిమా ప్లానింగ్ ఎంత పక్కాగా సాగుతోందో స్పష్టమవుతోంది. కీరవాణి(keeravani) సెప్టెంబర్ నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి, జనవరి నాటికి స్కోర్‌ను పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. దీంతో రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు ఉండదనే నమ్మకం ఫ్యాన్స్ లో మరింత బలపడింది.
మహేష్‌బాబు(mahesh babu) ఈ సినిమాలో రుద్రతో పాటు శ్రీరాముడి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయనున్నారనే సమాచారం ఇప్పటికే భారీ డిస్కషన్ కు దారి తీసింది. మరోవైపు ప్రియాంక చోప్రా(priyanka chopra) మందాకిని పాత్రలో కనిపించనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. పౌరాణిక అంశాలను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించగా, ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
సుమారు రూ.1300 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ భారీ సినిమాను కె.ఎల్. నారాయణ(KL Narayana)తో పాటు ఎస్.ఎస్. కార్తికేయ(SS Karthikeya) నిర్మిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) అందించిన కథకు దేవా కట్టా(Deva katta) సంభాషణలు రాస్తుండగా, సంగీత బాధ్యతలను ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) నిర్వహిస్తున్నారు. నిర్మాణం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి దశను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేస్తుండటంతో, వారణాసి ఇండియన్ సినీ హిస్టరీలో మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది. భారీ స్థాయి విజువల్స్, టెక్నికల్ క్వాలిటీ, బలమైన కథాంశంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.








