క్యాన్సర్ వెనుక ‘కార్పొరేట్ మాఫియా’ కథ? షాకిచ్చే నిజాలు
–సూర్య ప్రకాష్ జోశ్యుల
“మీకు క్యాన్సర్ ఉంది.”
డాక్టర్ నోటి నుంచి ఆ ఒక్క వాక్యం బయటకు వచ్చిన క్షణం…
ఒక కుటుంబం జీవితంలో వెలుగు తగ్గిపోతుంది. అమ్మ కళ్లలో భయం. తండ్రి మనసులో ఆందోళన. పిల్లల భవిష్యత్తుపై అనిశ్చితి.
కానీ…అదే క్షణంలో మరో ప్రపంచం కూడా కదలడం మొదలవుతుంది. ప్రాణాలను కాపాడే పేరుతో నడిచే వేల కోట్ల డాలర్ల ఆరోగ్య పరిశ్రమ. కొత్త మందులు. కొత్త చికిత్సలు. కొత్త పరీక్షలు. కొత్త బిల్లులు. కొత్త చెల్లింపులు.
ఒక కుటుంబానికి అది జీవితంలోనే అత్యంత దుర్దినం. అదే రోజు…ఎక్కడో ఒక భారీ ఆర్థిక వ్యవస్థకు మరో కొత్త “కస్టమర్” చేరతాడు.
ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు.
కానీ ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థిక మీడియా Bloomberg ఏడాది పాటు చేసిన విస్తృత దర్యాప్తు ఇప్పుడు ఇదే ఇబ్బందికరమైన ప్రశ్నను ప్రపంచం ముందుంచుతోంది.
క్యాన్సర్‌ను ఓడించడానికి ఈ వ్యవస్థ నడుస్తోందా… లేక క్యాన్సర్ చుట్టూ ఏర్పడిన మార్కెట్‌ను పెంచడానికా?
మనం వెళ్తోందా ఆస్పత్రులుకా లేక ‘కస్టమర్ జనరేటింగ్’ సెంటర్లుకా అనే బాధాకరమైన,ఆందోళనకరమైన ప్రశ్నను మన ముందు ఉంచుతోంది!
ఒకప్పుడు క్యాన్సర్ మందుల రీసెర్చ్… మెడికల్ కంపెనీలకు పెద్ద వ్యాపారం కాదు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సల మార్కెట్ విలువ ఏటా 200 బిలియన్ డాలర్లకు పైగా.ఒకప్పుడు మందుల పరిశోధనలు తక్కువగా ఉండే ఈ రంగాన్ని, ఇప్పుడు లాభాల పంట పండించే బంగారు బాతులా మార్చేశారు.
ధరలు కొండంత… ఫలితం మాత్రం గోరంత!
గడిచిన పాతికేళ్లలో (2000 సంవత్సరం నుండి) కొత్తగా వచ్చిన క్యాన్సర్ మందుల సగటు ప్రారంభ ధర ఏకంగా నాలుగు రెట్లు పెరిగి నెలకు $25,000 (సుమారు రూ. 20 లక్షలు) కి చేరింది! కానీ, అసలు నిజం ఏంటంటే… ఇలా లక్షలు పోసి కొంటున్న మందుల్లో సగం కంటే తక్కువ (40-45%) మందులు మాత్రమే రోగుల జీవితకాలాన్ని పెంచుతున్నాయని నిరూపితమైంది. అంటే, జీవిత కాలాన్ని పొడిగించలేమని తెలిసినా… కార్పొరేట్ కంపెనీలు ఆ వ్యాపారాన్ని, ఆ మందులను మాత్రం ఆపడం లేదు.
ఈ పరిశోధనలో ఇంకా ఆందోళన కలిగించే అంశాలు కూడా బయటపడ్డాయి.
హాస్పిటళ్ల దోపిడీ సామ్రాజ్యం
మందుల తయారీ కంపెనీలది ఒక దారైతే, చికిత్స అందించే హాస్పిటళ్లది ఇంకో దారి. సాధారణంగా లభించే జెనెరిక్ మందుల ధరలను కూడా ఈ హాస్పిటళ్లు 5, 10… చివరికి వందల రెట్లు మార్కప్ చేసి రోగులకు అమ్ముతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటళ్లు కలిసి ఆడే ఈ గేమ్ వల్ల చివరికి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది.
ఈ అదనపు భారం చివరికి ఎవరు భరిస్తారు?
రోగులు. బీమా సంస్థలు. చివరికి సమాజం మొత్తం.
తక్కువ మోతాదు ఇస్తే… లాభాలు తగ్గుతాయనే కుట్ర!
క్యాన్సర్ చికిత్సల్లో వాడే కొన్ని మందులు తక్కువ మోతాదు (Low dose) లో ఇచ్చినా అద్భుతంగా పనిచేస్తాయి. పైగా రోగికి నరకం చూపించే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. కానీ, కంపెనీలు ఆ వైపు పరిశోధనలే చేయడం లేదు! ఎందుకంటే… మందులు ఎంత ఎక్కువ మోతాదులో అమ్ముడుపోతే, కంపెనీలకు అంత ఎక్కువ లాభం. రోగి నరకయాతన అనుభవించినా సరే, వారి వ్యాపార లెక్కలు మాత్రం మారవు.
ప్రాణాల కన్నా ‘పైసలే’ ముఖ్యం
ఈ మహా దోపిడి సామ్రాజ్యంలో ఎవరి లాభాలు వారివి:
ఫార్మా కంపెనీలు: అడ్డగోలు ధరలతో మందుల విక్రయాలు.
కార్పొరేట్ ఆస్పత్రులు: బిల్లులను వందల రెట్లు పెంచి దండుకోవడం.
ట్రయల్ డాక్టర్లు: ప్రయోగాల పేరుతో పొందే ఆర్థిక లబ్ధి.
పరికరాల కంపెనీలు: లోపభూయిష్టమైన ప్రొడక్ట్స్ (ఉదాహరణకు సరైన ప్రామాణికత లేని బ్రెస్ట్ ఇంప్లాంట్స్) మార్కెట్లోకి వదిలి కోట్లు ఆర్జించడం.
ఈ దందా వల్ల చివరకు మిగులుతున్నది ఏంటి?
రోగి ప్రాణం నిలవడం మాట పక్కన పెడితే… సాధారణ కుటుంబాల కంటే క్యాన్సర్ బాధితుల కుటుంబాలు దివాలా (Bankruptcy) తీసే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అప్పులు తీర్చలేక కార్లు, ఇళ్లు వేలానికి వచ్చి, ఇన్సూరెన్స్ పేపర్లు కుదరక చికిత్స మధ్యలోనే ఆపేసి… క్యాన్సర్ ఒళ్లంతా పాకి ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులు ఎందరో!
ఈ కథలు కేవలం వ్యక్తిగత విషాదాలు కాదు. వ్యాధి ఎంత ప్రమాదకరమో… దాని చుట్టూ ఏర్పడిన ఆర్థిక భారం కూడా అంతే ప్రమాదకరమని గుర్తు చేసే ఉదాహరణలు.
మొత్తానికి, క్యాన్సర్ వైద్యం అనేది ఇప్పుడు రోగాన్ని నయం చేసే ఒక పవిత్రమైన సేవగా లేదు… మనుషుల బలహీనతను, చావు భయాన్ని పెట్టుబడిగా మార్చుకున్న ఒక ‘కార్పొరేట్ మెడికల్ మాఫియా’గా రూపాంతరం చెందింది!
క్యాన్సర్… రోగులను మాత్రమే కాదు, ‘కోట్ల రూపాయల కస్టమర్లను’ సృష్టిస్తోంది!








