అరటిపళ్ల పెట్టెల్లో రూ.2,400 కోట్ల కొకైన్! ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తారా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
అర్ధరాత్రి…
ఇటలీలోని ఆ భారీ పోర్టు ఇంకా నిద్రపోలేదు.
ఒక్కో భారీ కంటైనర్‌ను క్రేన్లు నెమ్మదిగా కిందకు దించుతున్నాయి.
వాటి మధ్య సాధారణంగా కనిపించే ఒక రీఫ్రిజిరేటెడ్ కంటైనర్ . దానిపై ఒకే ఒక్క స్టిక్కర్ “Fresh Bananas.”
దాన్ని చూసి ఎవరూ రెండోసారి కూడా అటు వైపు చూడరు. కానీ ఆ రోజు ఒక అధికారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో, అనుమానమే వచ్చిందో.. ఆ కంటైనర్ దగ్గర ఆగిపోయాడు. అంతే క్షణాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. భారీ ఇనుప తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. చల్లటి గాలి ఒక్కసారిగా బయటికి దూసుకొచ్చింది. ముందు వరుసగా అరటిపళ్ల పెట్టెలు. ధికారులు వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు.
ఒక్కటి…
రెండు…
మూడు…
చివరి వరుస తొలగించగానే… అరటిపళ్ల వెనుక వరుసగా అమర్చిన తెల్లటి ప్యాకెట్లు కనిపించాయి.అరటిపళ్ల వెనుక… 650 కొకైన్ ప్యాకెట్లు. వాటి మార్కెట్ విలువ ఊహిస్తేనే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ మొత్తం రూ.2,500 కోట్లు ($290 మిలియన్లు)!
ప్రపంచం ఆకలి తీర్చడానికి పండించే అరటిపండు… అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించే ‘కవర్’గా మారిపోయింది.అయితే ఇది తొలిసారి కాదు ఇలా జరగటం.
ఇప్పుడు మీకు సందేహం రావచ్చు…
ప్రపంచంలో వేల రకాల సరుకులు ఉండగా… డ్రగ్ మాఫియా ఎందుకు మళ్లీ మళ్లీ అరటిపళ్లనే ఎంచుకుంటుంది?
డ్రగ్ మాఫియా …సైంటిఫిక్ ప్లానింగ్
మనం మార్కెట్లో కొనుక్కునే అరటిపళ్లు కూడా ఇలాంటి భారీ షిప్పింగ్ కంటైనర్లలోనే వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దగ్గరకు చేరుతాయి. అదే వ్యవస్థను డ్రగ్ మాఫియా కూడా తమ అక్రమ రవాణాకు కవర్‌గా మార్చుకుంది. ఇటలీలోని ‘వడో లిగురే’ (Vado Ligure) పోర్టులో జరిగిన ఈ ఘటన కేవలం ఏదో యాదృచ్ఛికంగా చేసింది కాదు. దీని వెనుక పక్కా సైంటిఫిక్ ప్లానింగ్ ఉంది.
వేగవంతమైన తనిఖీలు (Fast Clearance):
అరటిపళ్లు త్వరగా పాడైపోయే పండ్లు (Perishable goods). అందుకే పోర్టుల్లో అధికారులకు వీటి కంటైనర్లను ఎక్కువ సేపు నిలిపి ఉంచే వెసులుబాటు ఉండదు. ఆలస్యమైతే పంట కుళ్ళిపోతుందనే నెపంతో కస్టమ్స్ తనిఖీలు వేగంగా జరుగుతాయి. డ్రగ్ కార్టెల్స్ సరిగ్గా ఈ బలహీనతనే వాడుకుంటాయి.
చల్లని ఉష్ణోగ్రతలు (Refrigerated Containers):
అరటిపళ్లను ప్రత్యేకమైన ‘రీఫర్’ కంటైనర్లలో దాదాపు 13°C వద్ద రవాణా చేస్తారు. ఈ చల్లని వాతావరణం, లోపలి తేమ డ్రగ్స్ వాసనను స్నిఫర్ డాగ్స్ (Sniffer Dogs) పసిగట్టకుండా కొంతవరకు అడ్డుకుంటుంది.
భారీ రద్దీ (High Volume):
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షలాది అరటిపళ్ల పెట్టెలు సరఫరా అవుతుంటాయి. వేల సంఖ్యలో వచ్చే కంటైనర్లలో ప్రతీ ఒక్కదాన్నీ విడమరిచి తనిఖీ చేయడం అధికారులకు అసాధ్యం.
ఈక్వెడార్ టు యూరప్: డ్రగ్ మాఫియా డ్రీమ్ రూట్!
డ్రగ్ మాఫియా మ్యాప్‌లో ఈక్వెడార్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటి ఎగుమతి దేశాలలో ఒకటి మాత్రమే కాదు… కొలంబియా, పెరూ వంటి ప్రపంచపు అతిపెద్ద కొకైన్ ఉత్పత్తి దేశాలకు సరిగ్గా పొరుగునే ఉంటుంది. దీంతో డ్రగ్ మాఫియా అక్కడ ఉత్పత్తి అయ్యే కొకైన్‌ను ఈక్వెడార్ పోర్టులకు తరలించి, చట్టబద్ధంగా ఎగుమతి అయ్యే అరటిపళ్ల లోడ్లలో చాకచక్యంగా దాచేస్తుంది. యూరప్‌లో కొకైన్కు ఉన్న భారీ డిమాండ్ కారణంగా ఈక్వెడార్–యూరప్ నౌకా మార్గం ప్రస్తుతం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలకు “గోల్డెన్ రూట్”గా మారింది.
ఒక్క కంటైనర్… వందల కోట్ల లాభం!
770 కిలోలు.
650 ప్యాకెట్లు.
290 మిలియన్ డాలర్లు.
(వాటి విలువ… మన దేశంలో వందల కోట్ల కాదు… ఏకంగా ₹2,500 కోట్లకు పైగా!)
కేవలం ఈ మూడు అంకెలే… కానీ ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్ నెట్‌వర్క్‌లలో ఒకదాని పరిమాణాన్ని చెప్పడానికి ఇవి చాలు.
సీజ్ చేసిన కొకైన్ విలువ దాదాపు రూ.2,500 కోట్లు. ఆ డబ్బుతో వందల స్కూళ్లు నిర్మించవచ్చు… వేల మందికి ఇళ్లు కట్టించవచ్చు… అంత పెద్ద మొత్తాన్ని డ్రగ్ మాఫియా ఒకే కంటైనర్‌లో దాచింది. కేవలం ఒక్క కంటైనర్‌ను క్రాస్ చేయించగలిగితే చాలు… మాఫియా సామ్రాజ్యానికి వందల కోట్ల లాభం వచ్చిపడుతుంది!
అధికారులు ఈ గుట్టు ఎలా రట్టు చేశారు?
ఇది రొటీన్ రాండమ్ చెకింగ్‌లో దొరికిన డ్రగ్స్ కావు. దీని వెనుక నెలల తరబడి సాగిన కార్గో ప్రొఫైలింగ్ (Cargo Profiling) , రిస్క్ అనాలసిస్ (Risk Analysis) ఉన్నాయి.
ఇంటెలిజెన్స్ సమాచారం: ఇటలీ ఆర్థిక పోలీస్ విభాగం (Guardia di Finanza), కస్టమ్స్ అధికారులకు ముందస్తుగా కొన్ని నిర్దిష్ట షిప్మెంట్లపై పక్కా సమాచారం అందింది.
అధునాతన స్కేనర్లు: కంటైనర్‌ను తెరవకుండానే లోపలి ప్యాకింగ్ నిర్మాణాన్ని విశ్లేషించే ఎక్స్-రే స్కేనర్ల ద్వారా అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తిస్తారు.
ఫిజికల్ రైడ్: అనుమానం బలపడటంతో అధికారులు రీఫర్ కంటైనర్‌ను తెరిచి, అరటి ప్యాలెట్ల వెనుక దాచిన ఆ భారీ డ్రగ్ లోడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ప్రపంచంలో ఇంతకుముందు కూడా ఇలా జరిగిందా?
డ్రగ్ కార్టెల్స్ పండ్లను, ఆహారాన్ని ముసుగుగా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి గ్లోబల్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు బయటపడ్డాయి:
అరటిపళ్లు: గతంలో బ్రిటన్, స్పెయిన్, పోలాండ్‌లలోని సూపర్ మార్కెట్లకు నేరుగా చేరిన అరటిపళ్ల పెట్టెల్లోనే ఏకంగా వందల కిలోల కొకైన్ దొరికిన ఘటనలు ఉన్నాయి.
అవకాడోలు: మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్ ‘అవకాడో’ పండ్ల గింజల స్థానంలో ప్లాస్టిక్‌తో తయారు చేసిన కొకైన్ బాల్స్‌ను అమర్చి స్మగ్లింగ్ చేసేవి.
కాఫీ బీన్స్: కొలంబియా నుంచి వచ్చే కాఫీ గింజల సంచుల్లో డ్రగ్స్ దాచడమే కాకుండా, కాఫీ పౌడర్‌లోనే కొకైన్‌ను కెమికల్గా కలిపేసి తర్వాత వేరుచేసే వింత పద్ధతులను కూడా వాడారు.
పైనాపిల్స్: పైనాపిల్ పండ్ల లోపల గుజ్జు తీసేసి, దాని స్థానంలో ప్లాస్టిక్ ప్యాకెట్లలో కొకైన్ దూర్చి, పైన మళ్లీ ఒరిజినల్ తోలు కప్పేసి పంపిన సందర్భాలు స్పెయిన్ పోర్టులో పట్టుబడ్డాయి.
ఫ్రోజన్ ఫుడ్: గడ్డకట్టిన చేపలు, ఫ్రోజన్ ప్రాసెస్డ్ ఫుడ్ మెటీరియల్స్ మధ్య కొకైన్ ఇటుకలను దాచి ఉంచడం మాఫియాకు మరో అలవాటు.
ఈసారి పట్టుకోకపోయి ఉంటే?
ఒక్కసారి ఆలోచించండి… ఈ ఒక్క కంటైనర్ గనుక అధికారుల కళ్లను తప్పించుకుని బయటకు వచ్చి ఉంటే?
ఆ సరుకు యూరప్‌లోని అక్రమ మార్కెట్లోకి చేరి, వేలాది చిన్న చిన్న డీలర్ల ద్వారా విస్తృతంగా పంపిణీ అయ్యే అవకాశం ఉండేది. అది నగరాల వీధుల్లోకి, పబ్‌లలోకి జారిపోయి కొన్ని వందల మంది ప్రాణాలను బలిగొనడంతో పాటు, డ్రగ్ మాఫియాకు రూ.2,400 కోట్ల కొండంత లాభాన్ని తెచ్చిపెట్టేది.
ఒకప్పుడు డ్రగ్స్ అంటే సరిహద్దుల్లో జరిగే స్మగ్లింగ్ మాత్రమే అనుకునేవాళ్లు. ఇప్పుడు మాత్రం ప్రపంచం తినే పండ్లు, కూరగాయలు, కాఫీ గింజలు, పూలు… ఇలా చట్టబద్ధమైన సరుకు రవాణా వ్యవస్థనే అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కవర్‌గా వాడుకుంటోంది.
ఆ రాత్రి…
ఇటలీ పోర్టులో తెరిచింది కేవలం ఒక కంటైనర్ కాదు. అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ఆలోచించే విధానాన్ని. ప్రపంచం అత్యంత సురక్షితమని నమ్మిన సరుకే…వాళ్లకు అత్యంత సురక్షితమైన దాచుకునే ప్రదేశంగా మారిపోయింది. అందుకే ఇది అరటిపళ్ల కథ కాదు. ప్రపంచంలోనే అత్యంత తెలివైన డ్రగ్ మాఫియా వ్యూహం కథ.








