టీడీపీలో ముద్రగడ సంతాప సభల సెగ..!
తెలుగుదేశం పార్టీ (TDP) విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు(Bonda Uma) అధిష్ఠానం వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగుతోంది. ఇటీవల ముద్రగడ పద్మనాభం సంతాప సభకు వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి బొండా ఉమా హాజరు కావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేయడంతో దీనిపై దుమారం రేగింది. ఈ అంతర్గత పరిణామాలపై బోండా ఉమ తాజాగా స్పందిస్తూ అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధిష్ఠానం వివరణ అడిగితే తప్పకుండా ఇస్తానని చెబుతూనే, తానేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధికారికంగా నిర్వహించిన ఏ సభకూ హాజరుకాలేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ మాజీ నేత దాసరి రాము వ్యక్తిగతంగా నిర్వహించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభకు మాత్రమే తాను హాజరయ్యానని ఉమ వివరణ ఇచ్చారు. ఆ సభకు వచ్చిన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడ కనిపిస్తే కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే పలకరించానని, అంతకు మించి అక్కడ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తేల్చి చెప్పారు.
తాను ఎప్పుడూ పార్టీకి ఇబ్బంది కలిగించే పనులు చేయలేదని, పార్టీ క్రమశిక్షణను ఎక్కడా ఉల్లంఘించలేదని వెల్లడించారు. ఇదే సందర్భంలో పార్టీలోని ఇతర సీనియర్ నేతల తీరును ప్రస్తావిస్తూ బోండా ఉమ అధిష్ఠానానికి సూటి ప్రశ్నలు వేశారు. వైసీపీ నేత జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన ముద్రగడ సంతాప సభకు టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూతో పాటు వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. “మరి వారిని కూడా పార్టీ అధిష్ఠానం వివరణ అడుగుతుందా?” అంటూ బోండా ఉమ వేసిన ప్రశ్న ఇప్పుడు టీడీపీ అంతర్గత వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై అధిష్ఠానం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.








