బోండా ఉమ వ్యాఖ్యలపై వర్మ ఫైర్.. వ్యక్తిగత ఎజెండా రుద్దొద్దు..!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు(Bonda Uma) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమంటూ బోండా ఉమ మాట్లాడటం ఎంతమాత్రం సరికాదని ఆయన కొట్టిపారేశారు. ఒక నాయకుడిగా ఉన్న వాస్తవాలు మాట్లాడాలి తప్ప, ఇలాంటి అబద్ధాలు చెప్పడం తగదని హితవు పలికారు. బోండా ఉమ తన వ్యక్తిగత అభిప్రాయాలను, వ్యక్తిగత ఎజెండాను పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేయవద్దని వర్మ ఘాటుగా హెచ్చరించారు.
కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి(TDP) నష్టం చేకూర్చే విధంగా గానీ, పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా గానీ ఎవరూ మాట్లాడకూడదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, అంతేకాని కాపు ఉద్యమం వల్లే పార్టీ ఓడిపోయిందనడం ముమ్మాటికీ తప్పు అని ఆయన తేల్చి చెప్పారు. గతంలో ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేసిన సమయంలో, ఆయన దీక్ష విరమణ చేసేలా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని వర్మ గుర్తు చేశారు.
చంద్రబాబు మరియు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కాపు సామాజికవర్గానికి పూర్తి న్యాయం చేశారని, కాపులకు న్యాయం చేసింది చంద్రబాబు ఒక్కరేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాపుల కోసం ఏకంగా రూ. 4,844 కోట్లు కేటాయించిన విషయాన్ని బోండా ఉమ ఎందుకు చెప్పడం లేదని వర్మ నిలదీశారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పాలే తప్ప.. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని సూచించారు.








