మానసిక వైకల్యం ఉన్న చిన్నారులపై బాధ్యత సమాజానిదే: దామోదర్ రాజనర్సింహ
మానసిక ఎదుగుదల లోపాలతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో తల్లిదండ్రులతో పాటు, సమాజం కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో.. సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ (సాధన ఫౌండేషన్)కు చెందిన మానసిక దివ్యాంగులైన చిన్నారులతో కలిసి సంస్థ ప్రతినిధులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిల్లలతో మంత్రి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. వారి అభిరుచులు, దైనందిన కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కలిసి నవ్వుతూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. 1996 నుంచి మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లల కోసం ప్రత్యేక విద్య, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, వృత్తి శిక్షణ, పునరావాస సేవలు అందిస్తున్నామని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు. సంస్థ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. అవసరమైన సహకారాన్ని అందించి, అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి పిల్లలకు సేవ చేస్తున్న సంస్థ నిర్వాహకులను అభినందించారు.
పిల్లల జీవితంలో తొలి ఐదేళ్లు అత్యంత కీలకమైనవని అన్నారు. ఈ దశలోనే శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి సకాలంలో చికిత్స, థెరపీ అందిస్తే వారి సమస్యను పరిష్కరించి, భవిష్యత్తును మెరుగుపరిచే అవకాశం ఉంటుందన్నారు. ఈ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ‘బాలభరోసా’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అంగన్వాడీ స్థాయి నుంచే చిన్నారుల్లో మానసిక, శారీరక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన వైద్య సేవలు, థెరపీ, పునరావాసం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. మానసిక ఎదుగుదల లోపాలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు అవసరమైన వైద్య సేవలు, విద్యను అందించేందుకు ప్రత్యేక వ్యవస్థలను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.








