ఊరంతా కోటీశ్వరులే.. ఈ వింత వెనుక అసలు కారణం ఇదే!
ఒక రోజు ఉదయాన్నే మీ ఇంటి ముందు కొందరు భారీ కార్లలో వచ్చి వాలారు… మీతో కొద్దిసేపు ముచ్చటించి, “మీకు ఉన్న ఆ 50 ఎకరాల భూమికి మేము ₹180 కోట్లు ఇస్తాం!” అని ఆఫర్ ఇచ్చారనుకోండి… మీరు ఏమంటారు?
మొదట నవ్వేస్తారు. “ఏదో పెద్ద జోక్ వేస్తున్నారు” అనుకుని అక్కడి నుంచి పంపించేయడానికి చూస్తారు. పెన్సిల్వేనియాకు చెందిన రైతు డేవిడ్ కిలిటీ దంపతులు కూడా సరిగ్గా ఇదే చేశారు!
వేటాడి తెచ్చుకున్న జింక మాంసాన్ని వండుకుని తింటూ ప్రశాంతంగా ఉన్న ఆ రైతు కుటుంబానికి, డెవలపర్లు వచ్చి తమ 89 ఎకరాల పాత వ్యవసాయ భూమి విలువ 20 మిలియన్ డాలర్లు (రూ.160 కోట్లకు పైగా) అని చెప్పినప్పుడు వారు నమ్మలేదు. కానీ, కొన్ని రోజుల్లోనే ఆ డబ్బు నిజంగానే వారి బ్యాంక్ ఖాతాలో పడింది!
కేవలం ఒక కుటుంబం కాదు… ఆ ఊళ్లోని 96 కుటుంబాలు తమకున్న 1,700 ఎకరాల భూమిని ఒకే ఒక్క కంపెనీకి ఏకంగా $586 మిలియన్లకు (దాదాపు ₹4,800 కోట్లు) అమ్మేశాయి! అంటే సగటున ఒక్కో కుటుంబం ఖాతాలో ₹45 కోట్లకు పైగా చేరాయి.
ఒక్కసారిగా ఆ పల్లెటూరు కోటీశ్వరుల గ్రామంగా మారిపోయింది!
అసలు ఈ భూమికి ఇంత బంగారు ధర ఎందుకు వచ్చింది?
ఇది బంగారం కథ కాదు… చమురు కథ కాదు… AI (కృత్రిమ మేధ) కోసం నడుస్తున్న భూముల వేట కథ!
ఈ రోజుల్లో ప్రపంచంలో అత్యంత విలువైన, డిమాండ్ ఉన్న ఆస్తి ఏమిటో తెలుసా? AI డేటా సెంటర్లు కట్టడానికి పనికొచ్చే భారీ భూమి!
మనం ఫోన్లలో వాడే ChatGPT, ఇతర AI మోడళ్లు వేగంగా పనిచేయాలంటే వెనుక వేల సంఖ్యలో సూపర్ కంప్యూటర్లు, సర్వర్లు రన్ అవ్వాలి. వీటినే “డేటా సెంటర్లు” అంటారు.ఒక పెద్ద AI డేటా సెంటర్లో లక్షలాది చిప్‌లు, వేలాది సర్వర్లు 24 గంటలూ పనిచేస్తుంటాయి.
ఎందుకు ఎకరాకు కోట్లు కుమ్మరిస్తున్నారు?
సాధారణ ఇండస్ట్రీకి కొద్దిపాటి స్థలం ఉంటే సరిపోతుంది. కానీ AI డేటా సెంటర్లకు వేల ఎకరాల విశాలమైన స్థలంతో పాటు, దానికి నిరంతర భారీ విద్యుత్ సరఫరా, నీటి వసతి అవసరం. అలాంటి భూములు ఎక్కడ దొరికితే అక్కడ డెవలపర్లు క్యూ కడుతున్నారు.
భారీ గిరాకీ:
బ్లాక్‌స్టోన్ వంటి దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు AI రేసులో వెనుకబడకూడదని, రైతులు అడిగిన దానికంటే వందల రెట్లు ఎక్కువ చెల్లించి మరీ భూములను కొనుగోలు చేస్తోంది.
మన దగ్గర కూడా ఇలాంటి రోజులు రాబోతున్నాయా?
తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR), అమరావతి లేదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కారిడార్ల చుట్టుపక్కల భూములు అమ్మి రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతుల కథలను చూశాం. IT కంపెనీలు వచ్చినప్పుడు భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి.
నెక్ట్స్ కోటీశ్వర గ్రామాలు మన దగ్గరే తయారవుతాయా?
కచ్చితంగా ఆ అవకాశం ఉంది! హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, అమరావతి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై పరిసరాలు ఇప్పటికే టెక్నాలజీ హబ్‌లుగా ఉన్నాయి. రేపు బహుళ జాతీయ సంస్థలు భారత్‌లో AI డేటా సెంటర్ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెడితే… ఇక్కడి గ్రామీణ ప్రాంతాల భూముల ముఖచిత్రం కూడా ఒకే ఒక్క రాత్రిలో మారిపోయే అవకాశం ఉంది.
ఇది కేవలం అవకాశమేనా? సవాళ్లు కూడా ఉన్నాయా?
ఒక్కసారిగా వందల కోట్లు చేతికి రావడం రైతులకు అద్భుతమైన అవకాశమే. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపమే మారిపోతుంది. కానీ ఈ నాణేనికి మరోవైపు కూడా ఉంది:
భూమి ధరల భారం: సాధారణ అవసరాలకు లేదా వ్యవసాయానికి భూములు అందుబాటులో లేకుండా ధరలు విపరీతంగా పెరిగిపోతాయి.
విద్యుత్, నీటి కొరత: AI డేటా సెంటర్లకు అత్యధిక పరిమాణంలో విద్యుత్, సర్వర్లను చల్లబరచడానికి మిలియన్ల లీటర్ల నీరు అవసరం. దీనివల్ల స్థానిక తాగునీరు, సాగునీటి వనరులపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
ఏదైమైనా…
ప్రతీ దానికి ప్లస్ లు, మైనస్ లు ఉన్నట్లే దీనికీ ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నదే భవిష్యత్తులో మనకూ జరగవచ్చు. AI వల్ల చాలామంది ఉద్యోగాలు పోతాయని భయపడుతుంటే… అదే AI ప్రపంచంలో భూమి విలువను సరికొత్తగా నిర్వచిస్తూ కొందరిని ఒకే రోజులో సంపన్నులను చేస్తోంది.
ఈ రోజు అమెరికాలో రైతుల భూమి విలువను AI మార్చేసింది. రేపు అదే కథ భారతదేశంలో కూడా రిపీట్ అయిుతే… అదృష్టం తలుపు తట్టే నెక్ట్స్ గ్రామం ఏది? ఊహించండి.
ఇవి కూడా చదవండి








