అమెరికాపై జిహాద్ చేయాల్సిందే .. హెజ్ బొల్లాకు ఇరాన్ సందేశం..!
పశ్చిమాసియా వార్ మరింత భీకరంగా మారిన వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. షియా సాయుధ సంస్థ హెజ్బొల్లాకు బహిరంగంగా మద్దతు పలికారు. ఇజ్రాయెల్, అమెరికా ఒత్తిళ్లు ఎంత పెరిగినా ప్రతిఘటన ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ.. హెజ్బొల్లాను ఉద్దేశించి ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హెజ్బొల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్‌కు పంపిన సందేశంలో “జిహాద్, ప్రతిఘటనే ముందుకు సాగే ఏకైక మార్గం” అని పేర్కొన్నారు మొజ్తబా. హెజ్బొల్లా ప్రస్తుతం “ప్రతిఘటన చరిత్రలో కీలక దశ”లో ఉందని పేర్కొన్నారు. యుద్ధాలు, ఆంక్షలు, నాయకత్వ మార్పులు వచ్చినా ప్రతిఘటన ఆగదని, పోరాట స్ఫూర్తే తమ బలమని చెప్పారు. హెజ్బొల్లా యోధులు లెబనాన్ ప్రజల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని ప్రశంసించారు.
అమెరికా, ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడానికి ప్రతిఘటించడం తప్ప వేరే మార్గం లేదన్నారు మొజ్తబా. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్య ఆగినప్పుడే.. అమెరికాతో ఇరాన్ సంఘర్షణ ముగుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు హెజ్బొల్లా సెక్రెటరీ జనరల్ షేక్ నయీమ్, ఆ సంస్థ సభ్యులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిని ఓ వ్యూహాత్మక ఆదేశంగా తీసుకొని, అమలు చేయాలని కోరారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు విధేయులుగా ఉంటామంటూ హెజ్బొల్లా ఓ లేఖను విడుదల చేసింది. దీనిపై మొజ్తాబా తాజా సందేశాన్ని విడుదల చేశారు. ‘‘అమెరికా నిరంకుశత్వం, అణచివేత ధోరణితో ప్రపంచ దేశాలు విసిగిపోయాయి. దాని ఆగడాలను అరికట్టాలంటే ప్రతిఘటనే మార్గం’’ అని పిలుపునిచ్చారు.
ఇటీవలి నెలల్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా ఘర్షణలు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, అనంతరం కాల్పుల విరమణతో మధ్యప్రాచ్య పరిస్థితులు కొంత మారాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో హెజ్బొల్లా వద్ద ఉన్న ఆయుధాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాల మధ్య ఖమేనీ చేసిన తాజా వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇరాన్‌కు హెజ్బొల్లా కేవలం మిత్ర సంస్థ మాత్రమే కాదు. ఇజ్రాయెల్, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాంతీయ “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్”లో అది కీలక భాగంగా టెహ్రాన్ భావిస్తోంది. అందుకే హెజ్బొల్లాకు రాజకీయ, వ్యూహాత్మక మద్దతు కొనసాగుతుందని ఖమేనీ తాజా ప్రకటన ద్వారా మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్‌లో ఇరాన్ ప్రభావం తగ్గలేదనే సంకేతాన్ని కూడా ఈ సందేశం ఇస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి. ఆ సంస్థ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చేందుకు లెబనాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దేశంలోని అన్ని ఆయుధ బలగాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని లెబనాన్ ప్రభుత్వం కూడా చెబుతోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఉన్నంత వరకు ఆయుధాలను వదిలే ప్రసక్తే లేదని హెజ్బొల్లా స్పష్టం చేస్తోంది.
ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ వైఖరిలో మార్పు వస్తుందేమోనని అంతర్జాతీయ వర్గాలు భావించాయి. అయితే ఖమేనీ తాజా ప్రకటనతో అలాంటి సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరిని కొనసాగిస్తూనే, తమ మిత్ర బలగాలకు మద్దతు తగ్గబోదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసినట్లయింది.








