మహర్షి సుశ్రుత వైద్యపద్ధతులను అద్యయనం చేయాలి… తానా సాహితీ సమావేశంలో వక్తలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలకు పైగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసినదే. “ప్రపంచంలోనే వైద్య శాస్త్రానికి ఆద్యుడు — మహర్షి సుశ్రుత” అనే అంశం మీద ఆదివారం జరిగిన 94 వ అంతర్జాల సమావేశం చాలా విజ్ఞానదాయకంగా జరిగింది.
యునైటెడ్ కింగ్డమ్ లో శస్త్రచికిత్సా వైద్యనిపుణుడిగా ప్రసిద్ధిచెందిన డా. చంద్ర చెరువు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ కుటుంబం తరపున రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ లో శస్త్రచికిత్సా పితామహుడు ఆచార్య సుశ్రుతిని 90 కిలోల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించగల్గడం అదృష్టంగా భావిస్తున్నామని, ఈ ప్రయత్నంలో సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు అలాగే ఇదే సందర్భంలో వెలువరించిన “మహర్షి సుశ్రుత ఏ కంపెండియం — ఫాదర్ ఆఫ్ సర్జరీ” అనే గ్రంధంలో విలువైన వ్యాసాలను వ్రాసి ప్రోత్సహించిన సహచర వైద్యమిత్రులకు ధన్యవాదములు అన్నారు.వేల సంవత్సరాలనాడే సుశ్రుతుడు సోదాహరణంగా వివరించిన వైద్య పద్దతులు, ఉపయోగించిన శస్త్ర పరికరాల జాబితా పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కల్గుతుందని అన్నారు. సుశ్రుతుడు రచించిన “సుశ్రుత సంహిత” గ్రంధంలోని అనేక విషయాలను ఇతర భారతీయ భాషలలోకి, ప్రపంచ భాషలలోకి అనువాదం కావలసిన అవసరం ఉందని, వైద్య విద్యార్థులకు ఆయన పరిశోధనలు, ఆవిష్కారాలు స్ఫూర్తి దాయకంగావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాము అదే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
”తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “వేల సంత్సరాలనాడే ప్రపంచం ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే సుశ్రుతుడు సంస్కృతంలో రచించిన 184 అధ్యాయాలగా ఉన్న “సుశ్రుత సంహిత” అనే ఆయుర్వేద గ్రంథం వైద్యులకు మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం అన్నారు. వైద్యవిధానంలో సంపూర్ణ విజ్ఞానం అందించిన సుశ్రుతిని పరిశోధనా విశేషాలను ప్రాధమికదశనుండే విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందన్నారు.
విశిష్టఅతిథులుగా పాల్గొన్న డా. బుచ్చిబాబు పైడిపాటి సుశ్రుతుడు ఎంతో విపులంగా పేర్కొన్న మెడికల్ ఎథిక్స్ గురించి, డా. వి. కె రాజు సుశ్రుతుడు చేసిన కంటివైద్య పద్దతుల గురించి, డా. శేషు శర్మ సుశ్రుత సంహితలో వాత, పిత్త, కఫ దోష పరిస్థితులను ఎదుర్కోవడానికి సరైన ఆహరం, వ్యాయామం, నిద్ర అలవాట్లు ఎంత ముఖ్యమో వివరించారు.అలాగే డా. పండరి గంటి సుశ్రుతుడు ప్రధానంగా ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా పనిచేస్తుందో సుశ్రుత సంహిత గ్రంధంలో పేర్కొన్నారని, అది నేటికీ ఫలవంతమైన చికిత్సేనని వెల్లడించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ పాల్గొన్న అతిథులందరికీ, ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.








