అమెరికాతో చర్చలకు ఇరాన్ మూడు షరతులు..!
పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఘర్షణలకుతాత్కాలిక బ్రేక్ పడినప్పటికీ అమెరికా వార్నింగ్స్.. ఇరాన్ కీలక నిర్ణయాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఇరుదేశాలు యుద్ధానికి విరామమిచ్చాయి.
హర్మూజ్ జలసంధిలో కొత్తమార్గం లేక ప్రత్యామ్నాయ మార్గానికి సంబంధించిన ప్రతిపాదనలను ఇరాన్ (Iran) తిరస్కరించింది. చర్చలు కొనసాగించేందుకు మూడు షరతులు విధించింది. జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని ధ్రువీకరించే విషయమై స్పష్టత వచ్చాకే చర్చలు ప్రారంభం కావాలని టెహ్రాన్ కోరుకుంటోంది. ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయడం మరొకటి. ఈ అంశాలు ఓ కొలిక్కి వచ్చాక అణుసమస్య గురించి మాట్లాడాలని కండీషన్ పెట్టింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హర్మూజ్‌లో రుసుము గురించి ఆ జలసంధికి ఇరువైపులా ఉన్న ఇరాన్, ఒమన్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి. తమ సార్వభౌమాధికారానికి నష్టం వాటిల్లకుండా, వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై ఇరుదేశాల ప్రతినిధులు చర్చించారు.








