రాజకీయాల వైపు ధనుష్ అడుగులు?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) చేసిన తాజా కామెంట్స్ కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చకు దారితీశాయి. అభిమాన సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఇచ్చిన మెసేజ్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. సినిమాల సక్సెస్‌లు, కటౌట్లు, వేడుకలకే అభిమానుల శక్తి పరిమితం కాకూడదని, అదే ఐక్యతను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల వైపు మళ్లించాలని ధనుష్ సూచించారు. తమ ప్రాంతాల్లో అవసరమైన కుటుంబాలకు తోడ్పాటు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.
ధనుష్ కామెంట్స్ చేసిన సమయమే ఇప్పుడు ఊహాగానాలకు ప్రధాన కారణంగా మారింది. ఇటీవల ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారిక జెండాను ఆవిష్కరించడం, తమిళనాడులో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించడం వంటి పరిణామాలు రాజకీయ ప్రవేశంపై సందేహాలకు బలాన్ని చేకూర్చాయి. గతంలో పలువురు తమిళ సినీ ప్రముఖులు అభిమాన సంఘాలను సామాజిక వేదికలుగా తీర్చిదిద్ది అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన ఉదాహరణలు ఉండటంతో, ధనుష్ కూడా అదే దిశగా ఆలోచిస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో వేగంగా సాగుతోంది.
అయితే ఇప్పటివరకు ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఆయన స్పీచ్ మొత్తం సామాజిక బాధ్యత, సేవా కార్యక్రమాల ప్రాధాన్యంపైనే కేంద్రీకృతమైంది. రాజకీయ పార్టీ స్థాపన లేదా ఎన్నికల్లో పోటీ వంటి అంశాలపై ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు నటుడిగా మాత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతూ తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు.








