టీడీపీ సీనియర్ కార్యకర్త బిళ్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి లోకేష్
కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని హామీ
గోసాల: కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెనమలూరు మండలం గోసాలలోని వేణుగోపాల స్వామి నగర్ లో నివాసం ఉంటున్న టీడీపీ సీనియర్ కార్యకర్త బిళ్ల సత్యనారాయణను పరామర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో అంకితభావంతో బిళ్ల సత్యనారాయణ పనిచేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి పసుపు రంగు చొక్కా ధరించి, తన ద్విచక్ర వాహనంపై టీడీపీ జెండాతో హాజరవుతూ గుర్తింపుపొందారు. గత మూడేళ్లుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్నారు. చిన్న కిరాణషాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనారోగ్య సమస్యల కారణంగా మరణించగా.. చిన్న కుమార్తె ఇటీవల భర్తను కోల్పోయి తన పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్.. బిళ్ల సత్యనారాయణ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బిళ్ల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని, అన్ని విధాల అండగా ఉంటానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.








