‘నేను రెడీ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన నర్గీస్ ఫక్రీ
నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవీష్ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్నాడు. సినిమా చూపిస్తా మామా, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి మాస్ హిట్ చిత్రాలతో ఫేమస్ అయిన త్రినాథరావు నక్కిన ‘నేను రెడీ’ని ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ నేను రెడీ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. తన అద్భుతమైన గ్లామర్, ఆకట్టుకునే ప్రజెన్స్ తో బాలీవుడ్లో సంచలనం సృష్టించిన నర్గీస్, ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ పాట పోస్టర్లో నర్గీస్ ఫఖ్రీ మెరిసే వెండి రంగు దుస్తులలో, కొవ్వొత్తులతో వెలిగే ఒక అద్భుతమైన బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఫోజ్ లో కనిపించారు. సెట్లోని ఎరుపు, నీలం రంగు లైటింగ్, నీడలా కనిపించే డ్యాన్సర్స్ ఒక ఉత్సాహభరితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, విటివి గణేష్ ఇతర ప్రముఖ తారాగణంగా ఉన్నారు.
ఈ చిత్రానికి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ నిజర్ షఫీ స్టైలిష్ విజువల్స్‌తో చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, కథ, స్క్రీన్‌ప్లేను విక్రాంత్ శ్రీనివాస్ రాశారు.
‘నేను రెడీ’ సినిమా రీ-రికార్డింగ్ పనులతో సహా షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ చిత్రం జూన్ రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, హవిష్‌కు క్లీన్ కమర్షియల్ విజయాన్ని అందిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.
వచ్చే వారం ఆడియో విడుదల చేసి, పూర్తి స్థాయి ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.







