జీతం పెరగగానే ఈ ఒక్క పని చేస్తే.. ఆర్థిక విజయం సాధించినట్లే!
Money Management: ఈ రోజుల్లో చాలా మంది మంచి జీతాలు సంపాదిస్తున్నప్పటికీ, జీవితంలో ఆర్థికంగా స్థిరపడటానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఉజ్వల భవిష్యత్తు అనేది కేవలం మనం సంపాదించే ఎక్కువ మొత్తంపైనే ఆధారపడి ఉండదు. ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy), సరైన బడ్జెట్ ప్రణాళిక, ఉన్న ఆదాయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోవడం వల్లే సంపాదన ఉన్నా చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఆదాయం పెరిగినప్పుడు దానికి సమానంగా మన ఖర్చులు ఎలా పెరుగుతున్నాయో గమనిస్తే, అసలు పొదుపు ఎలా చేయాలో సులభంగా అర్థమవుతుంది.
ఆదాయం పెరిగే కొద్దీ పెరుగుతున్న కోరికలు..
పెరిగిన ఆదాయం భవిష్యత్తులో మెరుగైన జీవితానికి గ్యారెంటీ ఇస్తుందని చెప్పలేం. ప్రస్తుతం చాలా మంది చదువు, ఇల్లు, కారు , క్రెడిట్ కార్డుల రుణాల ఈఎంఐల కింద తమ సంపాదనను కరిగించేస్తున్నారు. సమాజంలో తమ హోదాను చూపించుకోవాలనే తాపత్రయంతో.. ఆదాయం పెరగగానే లగ్జరీ ఇళ్లకు మారడం, సరికొత్త స్మార్ట్ఫోన్లు, ఖరీదైన వాహనాలు, గృహోపకరణాలు కొనుగోలు చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి తాత్కాలిక కోరికలు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయి.
అదనపు నగదు అనే భావన..
చాలా మంది ఉద్యోగులు తమకు వచ్చే బోనస్‌లను, జీతాల పెంపును (Hikes) లగ్జరీ ఖర్చుల కోసమే వచ్చిన ‘అదనపు’ నగదుగా భావిస్తారు. ఈ ఆలోచనే వారిని అనవసర ఖర్చుల వైపు నడిపిస్తుంది. పైకి చిన్నవిగా కనిపించే ఓటీటీ (OTT) సబ్స్క్రిప్షన్లు, యాప్ మెంబర్‌షిప్‌లు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు వంటి పునరావృత ఖర్చులు నెలాఖరుకల్లా జేబుకు పెద్ద చిల్లే పెడతాయి. సంపాదన పెరిగినప్పుడు పొదుపును పెంచకుండా, జీవనశైలి ఖర్చులను (Lifestyle Inflation) పెంచడం వల్ల సంపద సృష్టి అనేది సాధ్యం కాదు.
పాటించాల్సిన నియమాలు..
ఆటోమేటిక్ బదిలీ (50:50 రూల్)..
జీతం పెరిగిన వెంటనే, ఆ అదనపు మొత్తంలో కనీసం 50 శాతం దీర్ఘకాలిక పెట్టుబడులకు కేటాయించండి. మిగిలిన 50 శాతం మొత్తాన్ని మీ అవసరాలకు వాడుకోండి. జీతం అకౌంట్లో పడగానే సిప్‌లు (SIP), వీపీఎఫ్ (VPF), లేదా ఎన్పీఎస్ (NPS) ఖాతాలకు ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా సెట్ చేసుకుంటే విలాసాల కోసం ఖర్చు పెట్టే అలవాటు తప్పుతుంది.
దీర్ఘకాలంలో భారీ సంపద..
ప్రతి ఏటా జీతం పెరిగిన ప్రతిసారీ మీ ఎస్ఐపీ (SIP) పెట్టుబడి మొత్తాన్ని కూడా 10 నుండి 15 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. చిన్న మొత్తంలో చేసే ఈ పెంపు.. చక్రవడ్డీ ద్వారా దీర్ఘకాలంలో భారీ సంపదగా మారుతుంది.
అత్యవసర నిధి (Emergency Fund)..
పెరిగిన ఆదాయంతో మొదట ఒక ఎమర్జెన్సీ ఫండ్‌ను సిద్ధం చేసుకోండి. ఇది మీ కనీసం 6 నెలల ఇంటి ఖర్చులు , ఈఎంఐలకు సరిపోయేలా ఉండాలి.
ఆర్థిక విజయమంటే ఏంటి?
ఆర్థిక విజయం అంటే కేవలం ఎక్కువ సంపాదించడం లేదా విలాసవంతమైన వస్తువులను ప్రదర్శించడం కాదు. సరైన పెట్టుబడి ప్రణాళిక, అత్యవసర నిధి, తగినంత బీమా రక్షణ కలిగి ఉంటూ.. అప్పులను అదుపులో ఉంచుకోవడమే నిజమైన ఆర్థిక విజయం. అన్నింటికంటే ముఖ్యంగా, దీర్ఘకాలిక సంపదను సృష్టించుకుని ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేని మనశ్శాంతిని పొందడమే అసలైన సక్సెస్.







