పెద్ది నైజాం హక్కులకు మతిపోయే రేటు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi) రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, సినిమా ట్రేడ్‌లో మాత్రం ఇప్పటికే భారీ చర్చకు దారితీస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై ప్రేక్షకుల్లోనే కాదు, డిస్ట్రిబ్యూటర్లలో కూడా అసాధారణ స్థాయి ఆసక్తి కనిపిస్తోంది. తాజాగా నైజాం థియేట్రికల్ హక్కుల డీల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమా నైజాం హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ ఒప్పందం దాదాపు రూ.63 కోట్లకు కుదిరిందని, అందులో కొంత భాగం రికవరబుల్ అడ్వాన్స్ రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక సీడెడ్ ఏరియాలో కూడా పెద్ది దూకుడు కొనసాగుతోందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. అక్కడ ఈ సినిమా హక్కులు సుమారు రూ.25 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఒక సాధారణ ఒరిజినల్ కథతో తెరకెక్కుతున్న సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇది ఎలాంటి సీక్వెల్ లేదా ఫ్రాంచైజ్ చిత్రం కాకపోవడం విశేషం. నైజాం మార్కెట్లో గతంలో భారీ డీల్స్ సాధించిన సినిమాల సరసన ఇప్పుడు పెద్ది పేరు వినిపించడం చరణ్ మార్కెట్ స్థాయిని మరోసారి చూపిస్తోంది. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం మాత్రం ఏమాత్రం తగ్గలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
పెద్ది చుట్టూ ఏర్పడుతున్న ఈ భారీ హైప్‌కు ప్రధాన కారణం ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత చరణ్ సంపాదించుకున్న పాన్ ఇండియా ఇమేజ్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు పెరిగిన గుర్తింపు ఈ సినిమా బిజినెస్‌పై కూడా స్పష్టంగా ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు గ్రామీణ నేపథ్యంలో సాగే రా అండ్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా సినిమా రూపొందుతుండటంతో మాస్ ఆడియన్స్‌లోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార కంటెంట్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమా అంచనాలు మరింత ఎగసిపడుతున్నాయి. రిలీజ్‌కు ముందే ఈ స్థాయి థియేట్రికల్ బిజినెస్ నమోదు కావడం చూస్తుంటే, పెద్ది బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు వేదిక కావొచ్చనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.







