ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ దందా.. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన ఉద్యోగి!
NIMS: హైదరాబాద్‌లోని ప్రముఖ నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని సాగుతున్న ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడి చేయిస్తామంటూ నమ్మించి, ఓ బాధితుడి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి నిర్వాకం బయటపడింది.
అసలేంజరిగిందంటే..
కిడ్నీలు పాడవడంతో మహమ్మద్ సబీర్ అనే వ్యక్తి 2023 నుండి నిమ్స్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆ సమయంలో రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న నాగరాజు అనే ఉద్యోగితో అతనికి పరిచయం ఏర్పడింది. ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేసుకోకపోయినా, కేవలం నెల రోజుల్లోనే కిడ్నీ మార్పిడి ఏర్పాటు చేస్తానని నాగరాజు నమ్మించాడు. కిడ్నీ మార్పిడికి మొత్తం రూ. 2.5 లక్షలు ఖర్చవుతుందని చెప్పి, బాధితుడి నుండి రూ. 1.5 లక్షలు వసూలు చేశాడు. నమ్మకం కలిగించడానికి కొందరు వైద్యులను కూడా పరిచయం చేశాడు. ఎంతకాలం వేచి చూసినా సర్జరీ జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు, తన స్నేహితులతో చర్చించగా.. నిమ్స్‌లో ఇలా అనధికారికంగా డబ్బులు వసూలు చేయరని, అసలు జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్ లేకుండా కిడ్నీ మార్పిడి సాధ్యం కాదని తెలుసుకున్నాడు.
అధికారుల చర్యలు..
బాధితుడు నిలదీయడంతో నాగరాజు తాను తీసుకున్న డబ్బుకు బదులుగా లక్ష రూపాయల చెక్కు ఇచ్చాడు. అనంతరం బాధితుడు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన నిమ్స్ జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు, నిందితుడైన నాగరాజుపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ దందాలో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అవయవ మార్పిడి అనేది కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం, అధికారిక రిజిస్ట్రేషన్ ద్వారానే జరుగుతుంది. ఇలాంటి మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.







