ఇప్పట్లో ఎన్నికల్లేవు కాబట్టి ఏడాదిన్నర పాటు చేపట్టండి
రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)డిమాండ్ చేశారు. టీపీసీసీ ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేశ్ కుమార్ (Pulipati Rajesh Kumar) ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలతో ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్ రెడ్డి ( Sudarshan Reddy)ని బిఆర్ కె భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియలో భాగంగా పలుచోట్ల జరిగిన అక్రమాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో పారదర్శకంగా చేపట్టాలని కోరుతూ 22 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సీఈవోకు సమర్పించారు.
అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ సర్ ప్రక్రియ వల్లే బెంగాల్ లో రాజకీయ సమీకరణలు మారాయని, గెలవాల్సిన పార్టీలు ఓడిపోయాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరి సర్ పేరిట ఓటర్ల జాబితాను తప్పుల తడకగా మార్చొద్దని సీఈవోను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేనందున ఏడాదిన్నర పాటు జాగ్రత్తగా చేయాలి. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) 3-4 సార్లు ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయాలి. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల ప్రకారం పౌరసత్వ రుజువులను డిమాండ్ చేయకూడదు. మరణించారు, వలస వెళ్లారనే తప్పుడు నెపంతో ఫారం 7 ద్వారా బల్క్ (ఎక్కువ సంఖ్యలో) ఓట్ల తొలగింపు దరఖాస్తులపై కఠిన నిఘా ఉంచాలి అని తెలిపారు.







