ఏపీలో వీధి కుక్కలపై పోరాటం, పట్టణాలకు దూరంగా ‘ఫుడ్ షెల్టర్లు’..!
ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా సామాన్య ప్రజలను, ముఖ్యంగా చిన్న పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వీధి కుక్కల(Stray Dogs) నియంత్రణపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల విశాఖపట్నంలో(Vizag) ఒక అమాయక బాలుడిపై వీధి కుక్కలు అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, భవిష్యత్తులో ఇలాంటి హృదయవిదారక సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకూడదని మున్సిపల్ కమిషనర్లను కఠినంగా ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కల సంతానోత్పత్తిని అరికట్టేందుకు స్టెరిలైజేషన్ ప్రక్రియను యుద్ధప్రతిపాదికన వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3.2 లక్షల వీధి కుక్కలు ఉండగా, వాటిలో ఇప్పటికే 1.8 లక్షల కుక్కలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
మిగిలిన కుక్కలకు కూడా వీలైనంత త్వరగా స్టెరిలైజేషన్ పూర్తి చేయాలని, ఇందుకోసం ప్రత్యేక నిధులను, సిబ్బందిని కేటాయించాలని స్పష్టం చేశారు. కేవలం శస్త్రచికిత్సలకే పరిమితం కాకుండా, సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల జనావాసాలకు దూరంగా వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా ‘ఫుడ్ షెల్టర్లు’ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
పట్టణాల్లోని వ్యర్థాలు, చికెన్, మటన్ షాపుల వ్యర్థాల కారణంగానే కుక్కలు గుంపులుగా చేరి హింసాత్మకంగా మారుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. వాటికి జనావాసాల అవతల ఆహారం దొరికేలా ఈ షెల్టర్లను ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వ నిబంధనలను నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని, ప్రజల ప్రాణాల రక్షణే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.







