సామాన్యుడికి ‘పాల’ సెగ.. రెండు వారాల్లో రెండోసారి బాదుడు!
ప్రతి రోజూ ఉదయాన్నే కప్పు కాఫీ లేదా టీతో రోజును మొదలుపెట్టే సగటు భారతీయుడికి చేదు వార్త. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండగా, ఇప్పుడు ఆ సెగ పాల (Milk Price) వరకు పాకింది. దేశీయ పాల ఉత్పత్తుల దిగ్గజాలు అమూల్ (Amul), మదర్ డైరీ (Mother Dairy) మరోసారి వినియోగదారులపై ధరల భారాన్ని మోపాయి. లీటర్ పాలపై ఏకంగా రూ. 2 మేర పెంచుతున్నట్లు ప్రకటించి సామాన్యుడి బడ్జెట్‌ను అతలాకుతలం చేశాయి. ఈ కొత్త ధరలు మే 14 నుంచి అమల్లోకి రావడం గమనార్హం.
రెండు వారాల్లోనే రెండోసారి..
నిజానికి అమూల్ సంస్థ ఈ నెల 1వ తేదీనే పాల ధరలను (Milk Price) పెంచింది. ఆ దెబ్బ నుంచి జనం ఇంకా కోలుకోకముందే, కేవలం రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ ధరలు పెంచడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పశుగ్రాసం ధరలు పెరగడం, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు భారం కావడం, వీటన్నింటికీ తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు రైతులకు చెల్లించే పాల సేకరణ ధరలను కూడా పెంచామని, ఆ భారాన్ని సర్దుబాటు చేసేందుకే వినియోగదారులపై ఈ వడ్డన తప్పలేదని అమూల్ తెలిపింది.
మారిన ధరల ఇవే
అత్యధికంగా అమ్ముడయ్యే ఫుల్ క్రీమ్, టోన్డ్ పాల ధరలు (Milk Price) ఇప్పుడు రూ. 70 మార్కును దాటేశాయి.
అమూల్ కొత్త రేట్లు:
అమూల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్): రూ. 68 నుంచి రూ. 70కి చేరింది.
అమూల్ తాజా (టోన్డ్): రూ. 55 నుంచి రూ. 57కి పెరిగింది.
అమూల్ ఆవు పాలు: లీటరు రూ. 60.
అమూల్ గేదె పాలు: లీటరు రూ. 78.
మదర్ డైరీ కొత్త రేట్లు:
ఫుల్ క్రీమ్ పాలు: రూ. 70 నుంచి రూ. 72కి పెరిగింది.
టోన్డ్ పాలు: రూ. 58 నుంచి రూ. 60కి చేరింది.
ఆవు పాలు: లీటరు రూ. 62.
టోకెన్ పాలు: లీటరు రూ. 58.
ఇంటి బడ్జెట్‌పై ‘పాల’ ప్రభావం!
పాలు అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ప్రతి ఇంట్లో పిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యంత అవసరమైన పౌష్టికాహారం. లీటరుకు రూ. 2 పెరగడం పైకి తక్కువగా అనిపించినా, నెలకు లెక్కగడితే ఒక మధ్యతరగతి కుటుంబంపై వందల రూపాయల అదనపు భారం (Milk Price) పడుతుంది. ముఖ్యంగా హోటళ్లు, స్వీట్ షాపులు, టీ కొట్టు యజమానులు కూడా ఇప్పుడు తమ ధరలను పెంచే యోచనలో ఉన్నారు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని సామాన్యులు భయపడుతున్నారు.






