పోస్టాఫీస్ అదిరిపోయే ఆఫర్.. రూ. 549 లకే రూ. 10 లక్షల బీమా
మెదక్ తపాళా శాఖ సామాన్యులకు ఆరోగ్య భద్రతను మరింత చేరువ చేసే లక్ష్యంతో వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. నిరంతరం పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా, అప్పుల పాలు కాకుండా తక్కువ ప్రీమియంతో మెరుగైన చికిత్స పొందేలా ఈ పథకాలను రూపొందించారు.
కుటుంబ సభ్యులందరికీ రక్షణ..
నివా హెల్త్ ఇన్సూరెన్స్ సహకారంతో ప్రవేశపెట్టిన ‘బూపా హెల్త్ప్లస్’ ప్లాన్ ద్వారా ఒకరికి 899 రూపాయలు, దంపతులకు 1,399 రూపాయలు, ఇద్దరు పిల్లలతో కలిపి 2,199 రూపాయల వార్షిక ప్రీమియంతో 15 లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది. ఇందులో 2 లక్షల రూపాయల లోపు ఖర్చులను వినియోగదారులే భరించాల్సి ఉంటుంది, అంతకు మించితే తపాళా శాఖ చెల్లిస్తుంది.
బీమా వివరాలు..
ఆదిత్య బిర్లా సంస్థ సహకారంతో 18 నుండి 65 ఏళ్ల వయస్సు గల వారి కోసం ప్రత్యేక ప్రమాద బీమాను అందుబాటులోకి తెచ్చారు.
549 రూపాయల ప్రీమియంతో 10 లక్షల రూపాయల పాలసీ.
749 రూపాయల ప్రీమియంతో 15 లక్షల రూపాయల పాలసీ తీసుకోవచ్చు.
ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినా పూర్తి బీమా మొత్తం అందుతుంది. అంత్యక్రియల కోసం 5 వేల రూపాయలు, పిల్లల చదువు కోసం గరిష్టంగా లక్ష రూపాయల వరకు అదనపు ప్రయోజనం లభిస్తుంది.
ప్రజలందరూ ఈ తక్కువ ఖర్చుతో కూడిన బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ తపాళా శాఖ మేనేజర్ శ్రీనివాస్ కోరారు. ఇప్పటికే అనేకమంది ఈ పథకాల్లో చేరారని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.






