తెలంగాణలో ‘సర్’.. బీఆర్ఎస్ వైఖరేంటి?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) చిచ్చు రేపుతోంది. ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య యుద్ధానికి దారితీసింది. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వహిస్తున్న మౌనం రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీస్తోంది.
ఓటరు జాబితాలో బోగస్ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడమే ‘సర్’ లక్ష్యమని కేంద్రం చెబుతున్నా, బీజేపీయేతర పార్టీలు మాత్రం దీనిని ఒక రాజకీయ ఆయుధంగా చూస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువైంది. పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యంగా అక్రమ వలసదారుల పేరుతో మైనార్టీ వర్గాల ఓట్లు గల్లంతు చేశారని, తద్వారా బీజేపీ లబ్ధి పొందిందనే వాదన బలంగా వినిపించింది.
బీహార్ లో కూడా ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీలు సర్ విధానాన్ని వ్యతిరేకించాయి. పారదర్శకత లేని తొలగింపులు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని విమర్శించాయి. ఈ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చి పోరాడితే, తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది.
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC)ను కలిసి SIRపై తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. పౌరసత్వ చట్టాన్ని సాకుగా చూపి మైనార్టీల ఓట్లను తొలగించవద్దని, 14 రకాల గుర్తింపు కార్డుల్లో దేనిని చూపించినా ఓటరుగా గుర్తించాలని కోరింది. నిజామాబాద్, భైంసా, బోధన్ వంటి ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో, అక్కడ ‘సర్’ ప్రభావం తీవ్రంగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది.
దేశవ్యాప్తంగా బీజేపీయేతర పక్షాలు ‘సర్’పై గళమెత్తుతుంటే, బీఆర్ఎస్ మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. దీని వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మైనార్టీల ఓట్ల కోసం ‘సర్’ను వ్యతిరేకిస్తే, మెజారిటీ హిందూ ఓటర్లలో వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారనే సందేహం కలుగుతోంది. ఇప్పటికే మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో, ఇప్పుడు వారి కోసం పోరాడి ఉన్న హిందూ ఓట్లను పోగొట్టుకోవడం ఎందుకని బీఆర్ఎస్ భావిస్తుండవచ్చు. ఇటీవల ప్రధాని మోడీ పర్యటనపై కూడా బీఆర్ఎస్ పెద్దగా స్పందించలేదు. ‘సర్’ వంటి విధానపరమైన అంశాల్లో బీజేపీని విమర్శించకపోవడం ద్వారా, కేంద్రంతో సన్నిహితంగా ఉండాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పాతబస్తీ వంటి చోట్ల ఎంఐఎం బలంగా ఉంది. అక్కడ ఓట్లు తొలగించినా ఎంఐఎంకే నష్టం తప్ప తమకేమీ కాదనే ధీమా కూడా బీఆర్ఎస్లో ఉండవచ్చు.
ఒకవైపు కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం చుట్టూ తిరుగుతోంది. ఎంఐఎం తనదైన శైలిలో పోరాటానికి సిద్ధమవుతోంది. కానీ, రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వంటి పార్టీ, ఇంతటి కీలకమైన అంశంపై నోరు విప్పకపోవడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తోంది. ఓటర్ల తొలగింపు ప్రక్రియ పూర్తయ్యాక, తుది జాబితా వచ్చాక కూడా బీఆర్ఎస్ ఇదే మౌనాన్ని కొనసాగిస్తే.. ఆ పార్టీ కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల ఓటు హక్కుపై ఆసక్తి లేదని స్పష్టమవుతుంది.
బీఆర్ఎస్ మౌనం.. బీజేపీకి పరోక్షంగా సహకరించడమే అవుతుందనే విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకత్వంపై ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ‘సర్’ చుట్టూ జరుగుతున్న ఈ లొల్లి, రాబోయే ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేలా కనిపిస్తోంది.






