పెద్ది రిలీజ్ కు లైన్ క్లియర్
టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న పెద్ది ఒకటి. డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్ దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదాలు ఈ సినిమా విడుదలపై ప్రభావం చూపుతాయా అనే చర్చలు బలంగా వినిపించాయి. ముఖ్యంగా థియేటర్ల రెవెన్యూ షేరింగ్, పర్సంటేజ్ విధానం వంటి అంశాలపై నెలకొన్న విభేదాలు పెద్ద సినిమాల రిలీజ్‌లపై అనిశ్చితిని తీసుకొచ్చాయి. దీంతో పెద్ది రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన కీలక సమావేశం తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారినట్లు సమాచారం. థియేటర్ల కోసం పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు అంగీకరించడంతో పాటు, A, B, C సెంటర్లకు అనుగుణంగా సరైన విధానం రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగుకి పెద్ది నిర్మాత వెంకట సతీష్ కిలారు కూడా హాజరయ్యారు. సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన ఆర్థిక ఒత్తిళ్లు, పలు కారణాల వల్ల జరిగిన ఆలస్యాల గురించి ఆయన వివరించినట్లు సమాచారం. అయినప్పటికీ సినిమాపై టీమ్ పూర్తి నమ్మకంతో ఉందని, విడుదలను అత్యంత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ పరిణామాలతో పెద్ది రిలీజ్ కు ఉన్న అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్టే కనిపిస్తోంది. జూన్ 4న తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఎగ్జిబిటర్లు కూడా పెద్ది డిస్ట్రిబ్యూటర్లకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. భారీ యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు మరో బిగ్ బాక్సాఫీస్ ఈవెంట్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి






